తాగునీటి గండం నుంచి..గట్టెక్కేనా

తాగునీటి గండం నుంచి..గట్టెక్కేనా
  •     ఎల్లంపల్లిలో అడుగంటుతున్న జలాలు
  •     20.175 టీఎంసీలకు .. 5.69 టీఎంసీలకు పడిపోయిన నీటిమట్టం

గోదావరిఖని, వెలుగు : ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ​లో రోజురోజుకు నీరు అడుగంటుతున్నది. ప్రాజెక్ట్​ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా శనివారం నాటికి 5.69 టీఎంసీలకు పడిపోయింది. పూర్తి నీటి మట్టం  148 మీటర్లు కాగా శనివారం నాటికి 140.68 మీటర్లకు చేరింది. హైదరాబాద్​ తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్​ పంప్ ​హౌస్​ నుంచి ప్రతి రోజు ఆరు మోటర్ల ద్వారా నీటిని పంపింగ్​ చేస్తున్నారు.

ఎల్లంపల్లి ప్రాజెక్ట్​ లో నీటి మట్టం 138.3 మీటర్లకన్నా తక్కువకు చేరితే హైదరాబాద్​ తో పాటు మిషన్​ భగీరథ, ఆర్​ఎఫ్​​సీఎల్​ కు కూడా వాటర్​ సప్లై బంద్​ అవుతుంది. ఇది ప్రస్తుతం తీవ్రమైన సమస్య కాగా... వర్షాలు అధికంగా కురిస్తే తప్ప ఈ గండం నుంచి గట్టేక్కే మార్గం కనిపించడం లేదు. 

 కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు బంద్​

మేడిగడ్డ బ్యారేజీ వద్ద 2023 అక్టోబర్​ 21నపిల్లర్లు కుంగిపోవడంతో బ్యారేజీలో  నీటిని నిల్వ  చేసే అవకాశం లేకుండా పోయింది. అలాగే అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలకు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు, నీటిపారుదల శాఖ ఆఫీసర్లు పేర్కొనడంతో ఈ రెండు బ్యారేజీల్లోని  నీటిని కూడా దిగువకు వదిలిపెట్టారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్ట్​ నుంచి ఎల్లంపల్లిలోకి ఎత్తిపోతలు పూర్తిగా బంద్​ అయ్యాయి. 

 ప్రాజెక్ట్​లో ఉన్న నీటినే సప్లై చేస్తున్నారు...

అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి శివారులో నిర్మించిన 'మౌలానా అబ్దుల్​ కలామ్​ సుజల స్రవంతి ప్రాజెక్ట్​' నుంచి ఆరు  మోటర్ల ద్వారా హైదరాబాద్​కు, మూడు మోటర్ల ద్వారా ఆర్​ఎఫ్​సీఎల్​కు, రెండు మోటర్ల ద్వారా మిషన్​ భగీరథ కోసం నీటిని సప్లై చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్​లోని నీరు గ్రావిటీ కాల్వలోకి చేరితే అక్కడి నుంచి రెగ్యులర్​ మోటర్ల ద్వారా నిర్దేశిత ప్రాంతాలకు నీరు సప్లై అవుతుంటుంది. 

ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిన ఆఫీసర్లు

ఎల్లంపల్లి ప్రాజెక్ట్​లో నీటి నిల్వ మట్టం 138.3 మీటర్లకు చేరితే ప్రాజెక్ట్​లోని నీరు గ్రావిటీ కాల్వలోకి రావడం కష్టసాధ్యమవుతుంది. ప్రాజెక్ట్​లో రోజురోజుకు నీటి నిల్వలు తగ్గుముఖం పడుతుండడంతో  నీటి లభ్యత ఉన్న చోట మోటర్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా గ్రావిటీ కాల్వలోకి నీటిని పంపింగ్​ చేసేలా ఆఫీసర్లు ప్రత్యామ్నాయంగా ముందస్తు ఏర్పాట్లు చేశారు.

ఇందు కోసం హెడ్​ రెగ్యులేటరీ నుంచి గ్రావిటీ కాల్వ చివరి వరకు తాత్కాలికంగా 1.8 కిలోమీటర్ల మేర మట్టి రోడ్డును నిర్మించారు. 125 హెచ్​పీ సామర్ధ్యం గల 25 మోటర్లను బిగించడానికి సిద్దం చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్​లో నీటి నిల్వ మట్టం 140.68 మీటర్లు ఉండడంతో ఆఫీసర్లు వేచి చూస్తున్నారు. 

వర్షాలపైనే ఆధారం..

ఎల్లంపల్లి ప్రాజెక్ట్​లో 2023 మే 18వ తేదిన నీటి మట్టం 148 మీటర్లకు గాను 145.41 మీటర్లు ఉండగా 2024 మే 18వ తేదిన అది 140.68 మీటర్లకు పడిపోయింది. అలాగే ప్రాజెక్ట్​లో నీటి సామర్ధ్యం 20.175 టీఎంసీలకు గాను 2023 మే 18వ తేదిన 13.55 టీఎంసీలు ఉండగా 2024 మే 18వ తేదిన 5.69 టీఎంసీలకు చేరింది. అంటే రాబోయే రోజుల్లో మరింత నీటి సామర్ధ్యం  పడిపోయే అవకాశం ఉంది. మోటర్లను బిగించినా అవి పూర్తి స్థాయిలో నీటిని పంపింగ్​ చేస్తాయా ? లేదా అన్నది అనుమానాస్పదమే. దీని వల్ల హైదరాబాద్​కు, మిషన్​ భగీరథకు​ తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఏర్పడే ఆస్కారం ఉంది.  

శుక్రవారం కురిసిన వర్షాలతో ఎగువ నుంచి 523 క్యూసెక్కుల నీరు ఎల్లంపల్లి ప్రాజెక్ట్​లోకి చేరింది. అయితే ఎన్టీపీసీకి 242  క్యూసెక్కుల నీరు, హైదరాబాద్​ మెట్రో వాటర్​ వర్క్స్​కు 329 క్యూసెక్కుల నీరు, మిషన్​ భగీరథ కింద రామగుండం, పెద్దపల్లికి 58 క్యూసెక్కుల నీరు, మంచిర్యాలకు 23 క్యూసెక్కుల నీటిని సప్లై చేస్తున్నారు. ఎండలకు 141 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతున్నది. కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు లేనందున ఈ ఇబ్బందుల నుంచి గట్టేక్కడానికి వర్షాలు అధికంగా కురవడమే ఏకైక మార్గంగా ఆఫీసర్లు భావిస్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.