భయమే లేదు.. తొక్కించేయటమే: కారు బానెట్‌పై ట్రాఫిక్ పోలీస్.. అలాగే పోనిచ్చిన ఓనర్

భయమే లేదు.. తొక్కించేయటమే: కారు బానెట్‌పై ట్రాఫిక్ పోలీస్.. అలాగే పోనిచ్చిన ఓనర్

రోడ్డుపై వెళ్తున్నపుడు ట్రాఫిక్ పోలీస్ వాహనాన్ని ఆపాడంటే.. అన్ని డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నా, వాహనదారులను ఎంతో కొంత భయం వెంటాడుతుంటుంది. అంతెందుకు సైకిల్ పై వెళ్లే వాళ్లను ఆపినా ఏదో ఓ రకంగా ఫైన్ వేస్తాడనే భయం ఉండేది.. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు అస్సలు వాహనదారుల్లో భయమే లేదు. పోలీసన్నా.. ట్రాఫిక్ పోలీసన్నా.. నడుపుతున్న వాహనంతో తొక్కించేయటమే. అలా తయారయ్యారు వాహనదారులు. బెంగళూరులో జరిగిన ఘటన చూస్తే వామ్మో అని నోరెళ్లబెట్టాల్సిందే.

పోలీసుల కథనం ప్రకారం, గురువారం(అక్టోబర్ 24) మధ్యాహ్నం ఈస్ట్‌ ట్రాఫిక్‌ స్టేషన్‌ సిబ్బంది బీహెచ్‌ రోడ్డులోని సహ్యాద్రి కళాశాల ఎదుట వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వస్తున్న తెల్లటి కారును  ట్రాఫిక్ సిబ్బంది ఆపే ప్రయత్నం చేశారు. రోడ్డు పక్కన వాహనాన్ని ఆపాలని సూచించారు. ఆపితే లేని డాక్యుమెంట్లు అడిగి, ఎక్కడ ఫైన్ వేస్తారో అన్న భయంతో డ్రైవర్ కారును ఆపకుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. 

ALSO READ | 50 పైసల వివాదం..పోస్ట్ ఆఫీస్కు రూ.15వేలు జరిమానా

ఈ విషయాన్ని పసిగట్టిన  ట్రాఫిక్ కానిస్టేబుల్.. కారు ముందుకి వచ్చి మరోసారి వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించాడు. అప్పటికీ డ్రైవర్ తన కారును ఆపకగపోగా.. పోలీసు సిబ్బంది వెంటనే కారు ముందు భాగం పట్టుకుని బానెట్‌పైకి ఎక్కారు. అయినప్పటికీ, డ్రైవర్ మాత్రం తన మొండి వైఖరి వదల్లేదు. 100 మీటర్ల దూరం అలానే ముందుకు దూసుకెళ్లాడు. అనంతరం అక్కడి నుండి పారిపోయాడు. ఆ దృశ్యాలను కొందరు తమ మొబైల్ ఫోన్లలో బంధించి నెట్టింట పోస్ట్ చేశారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. కారు నెంబర్ ఆధారంగా యజమాని కోసం గాలిస్తున్నారు.