చలానా కట్టమన్నందుకు ట్రాఫిక్ పోలీసును కారు బానట్‌పై లాక్కెళ్లిన డ్రైవర్

చలానా కట్టమన్నందుకు ట్రాఫిక్ పోలీసును కారు బానట్‌పై లాక్కెళ్లిన డ్రైవర్

చలానా కట్టమన్నాడని ట్రాఫిక్ కానిస్టేబుల్ ని ఓ కారు డ్రైవర్ ఏకంగా 4కిలో మీటర్ల దూరం వరకు లాక్కొని వెళ్లాడు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడడమే కాకుండా అడ్డుగా ఉన్న కానిస్టేబుల్ పైనా దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇండోర్ లోని సత్యసాయి జంక్షన్ వద్ద ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శివసింగ్ చౌహాన్ రోజూలాగే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సమయంలోనే కారులో వచ్చిన ఓ వ్యక్తి ఫోన్ లో మాట్లాడుకుంటూ కనిపించాడు. డ్రైవింగ్ చేస్తూ, ఫోన్ మాట్లాడడం తప్పని చెప్పిన కానిస్టేబుల్.. ఆ వ్యక్తిని జరిమానా కట్టాలని ఆదేశించాడు. దీంతో కారు డ్రైవర్, ట్రాఫిక్ కానిస్టేబుల్ తో వాగ్వాదానికి దిగాడు.

అయితే.. సదరు వ్యక్తిని ఆపే ప్రయత్నంలో కానిస్టేబుల్ కారు బానట్(ముందు భాగం)పైకి ఎక్కాడు. అయినప్పటికీ ఆ వ్యక్తి కారును ఆపకుండా అలానే 4 కిలోమీటర్లు వరకూ కారు నడుపుకుంటూ వెళ్లిపోయాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్‌కు గాయాలైనట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అనంతరం ఆ కారు డ్రైవర్‌ను అరెస్ట్‌ చేసి ఐపీసీ సెక్షన్‌ 279, 332 కింద కేసు నమోదు చేసినట్లు లసుదియా పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌ఎస్‌ దండోతియా తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఓ పిస్టల్‌, ఓ రివాల్వర్‌ సైతం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ‍అయితే అవి లైసెన్స్‌తో తీసుకున్నవేనని నిందితుడు తెలిపాడన్నారు.