- ఆర్టీసీలో డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్
- బస్సుల్లో కెమెరాలు.. కమాండ్ కంట్రోల్ నుంచి మానిటరింగ్
- త్వరలో అమలు చేసేందుకు అధికారుల సన్నాహాలు
- దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులపైనే మొదటి విడత ఫోకస్
- తర్వాత అన్ని సర్వీసులకు అమలు చేసే యోచన
హైదరాబాద్,వెలుగు: ప్రయాణికుల భద్రతపై టీజీఎస్ఆర్టీసీ మరింత ఫోకస్పెట్టింది. ఆర్టీసీ బస్సు అంటే భద్రతకు సింబల్అన్న రీతిలో సంస్థను తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే బస్సు నడిపే డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఉండేందుకు ఉన్నతాధికారులు కఠిన విధానాలను అమలు చేయాలని నిర్ణయించారు. త్వరలో బస్సుల్లో డ్రైవర్ మానిటరింగ్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టంను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
దీంతో డ్రైవర్ బస్సు నడుపుతున్న విధానాన్ని ఉన్నతాధికారులు నేరుగా పరిశీలించనున్నారు. నిర్లక్ష్యంగా బస్సు నడిపినా, ప్రమాదకరంగా నడిపినా వెంటనే సదరు డ్రైవర్‌ను అలర్ట్ చేస్తారు. అతడికి అసిస్టెంట్‌గా ఉన్న వ్యక్తిని కూడా అప్రమత్తం చేస్తారు. ఈ విధానం వల్ల బస్సు ప్రమాదాలను వంద శాతం నివారించడానికి అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కొన్ని రూట్లలో ఈ విధానాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా అమలు చేసినట్టు తెలిపారు. ఆయా పనులను నిర్వహించడానికి టెక్నికల్ కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానించినట్టు అధికారులు తెలిపారు.
డ్రైవర్ మానిటరింగ్ సిస్టం ఎలా పనిచేస్తుందంటే?
మొదటి విడతలో దూర ప్రాంతాలకు వెళ్లే హైఎండ్ సూపర్‌లగ్జరీ, ఏసీ బస్సుల్లో డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన బస్సుల్లో కెమెరాలను అమర్చుతారు. ఈ కెమెరాలను ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తారు. దీంతో డ్రైవర్బస్సు ఎలా నడుపుతున్నాడు? బస్సు ఏ రూట్లో వెళ్తున్నది? ఎంత స్పీడ్‌లో వెళ్తున్నది? డ్రైవర్ ఏమైనా నిర్లక్ష్యంగా నడిపిస్తున్నాడా? అన్న విషయాలను కమాండ్ కంట్రోల్ నుంచి అధికారులు పర్యవేక్షిస్తారు. డ్రైవర్ బస్సు నడపంలో ఏదైనా పొరపాట్లు చేస్తున్నట్టు గమనిస్తే వెంటనే అతడితో మట్లాడే అవకాశం కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ విధానం వల్ల డ్రైవర్ ఎప్పుడూ అలర్ట్‌గా ఉంటాడని, జాగ్రత్తగా బస్సు నడిపే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. దూర ప్రాంతాలకు.. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
దశల వారీగా అన్ని బస్సులకు..
డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని రూట్లలో అన్ని బస్సు లకు అమలు చేసే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 9 వేలకు పైగా ఉన్న బస్సులను మానిటర్ చేయడం అంత సులభం కాదని, అందుకే ముందు దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులపై దృష్టి పెట్టామన్నారు. ఈ టెక్నాలజీ అమల్లో కి వస్తే దేశంలోనే అత్యంత అడ్వాన్స్డ్ విధానంలో బస్సులను నడుపుతున్న సంస్థగా టీజీఎస్ ఆర్టీసీకి పేరొస్తుందని అధికారులు తెలిపారు. అలాగే బస్సు ప్రమాదాలను పూర్తిగా తగ్గించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడిచే బస్సులకు ఈ కొత్త టెక్నాలజీ అమలు చేసే విషయంపై ఆలోచిస్తున్నట్టు తెలిపారు.