ఫ్లోరిడాలో యాక్సిడెంట్.. 8 మంది కార్మికులు మృతి

  •     మరో 40 మందికి గాయాలు

ఓకాలా: ఫ్లోరిడాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పుచ్చకాయల పొలంలో పని చేసేందుకు కార్మికులను తీసుకెళ్తున్న బస్సును పికప్​ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మెక్సికోకు చెందిన ఎనిమిది మంది కార్మికులు మృతిచెందారు. మరో 40 మంది గాయాలపాలయ్యారు. మంగళవారం ఓర్లాండోకు 130 కిలో మీటర్ల దూరంలో ఉన్న డన్నెల్లన్‌‌లోని కానన్ ఫార్మ్స్‌‌కు కార్మికులు బస్సులో వెళ్తుండగా ఉదయం 6:40 గంటల సమయంలో ఓ ట్రక్కు వచ్చి బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు కొంతదూరం దూసుకెళ్లి, ఆపై బోల్తా పడింది. పోలీసులు స్పాట్ కు చేరుకొని బస్సు కిటికీలు పగులగొట్టి గాయపడిన వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. మెక్సికో ఫారిన్ రిలేషన్స్ సెక్రటరీ అలీసియా బార్సెనా ఈ వార్తను ధ్రువీకరిస్తూ మంగళవారం ఎక్స్​లో పోస్ట్ చేశారు. ఓర్లాండోలోని మెక్సికన్ కాన్సులేట్ బాధితులకు సహాయాన్ని అందించడానికి పని చేస్తోందని తెలిపారు. ఫార్మ్ వర్కర్స్ బస్సును ఢీకొట్టిన పికప్ ట్రక్కు డ్రైవర్‌‌ను ఫ్లోరిడా హైవే పెట్రోల్ పోలీసులు అరెస్టు చేశారు.