పైసల ఆశతో గంజాయి తీసుకెళ్తూ.. దొరికిపోయిన ఉత్తర ప్రదేశ్​ డ్రైవర్లు

  •     రూ.20లక్షల విలువైన సరుకు పట్టివేత

కోదాడ,వెలుగు: ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి నుంచి మహారాష్ట్ర కు  గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సోమవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ వద్ద పోలీసులు పట్టుకున్నారు.   వారి నుంచి  రూ.20లక్షల విలువ చేసే117.35 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లా అశోక్ విహార్ కు చెందిన సల్మాన్ అలియాస్ సల్మాన్ మాలిక్, అరుణ్ లారీ డ్రైవర్లు గా పని చేస్తున్నారు.

వారికి ఆ వృత్తిలో వచ్చే ఆదాయం ఖర్చులకు,  జల్సాలకు సరిపోవడం లేదు.  దీంతో ఏదైనా అక్రమ వ్యాపారం చేసి భారీగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు.  ఈ క్రమంలో వారు చేపల లోడ్ తో రాజమండ్రికి వెళ్లినప్పుడు గంజాయి వ్యాపారం చేసే చిరంజీవితో పరిచయం ఏర్పడింది.  ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ వెళ్లిన వారిని చిరంజీవి పని వుందని చెప్పి మార్చి 28న రాజమండ్రికి  రప్పించాడు.  నాలుగు రోజుల తర్వాత అతడు వారికి 65 గంజాయి ప్యాకెట్ల తో నింపిన కారును అప్పగించి దీనిని మహారాష్ట్ర లో తాను చెప్పిన చోట డెలివరీ ఇవ్వాలని సూచించాడు.

ఇందుకు వారికి రూ. 6 వేలు అడ్వాన్స్ ఇచ్చి , కారు అప్పగించిన తర్వాత మరో రూ.12 వేలు ఇస్తారని , కారు తాను చెప్పిన చోట వదిలి వెళ్లాలని చెప్పాడు. దీంతో వారు కారులో మహారాష్ట్ర కు బయలుదేరారు.  మధ్యలో పోలీసులను తప్పించుకుంటూ సాయంత్రానికి రామాపురం క్రాస్ రోడ్ లోని చెక్ పోస్ట్ వద్దకు చేరుకున్నారు.  అక్కడ పోలీసులు తనిఖీ  చేస్తుండడంతో కారును పక్కన నిలిపి ఉంచి అవకాశం కోసం చూశారు. వీలు కాకపోవడంతో కారు ను వదిలి పెట్టి వెళ్లేందుకు రెడీ అయ్యారు.

ఆ కారును గమనిస్తున్న పోలీసులు వారు పారిపోతుండగా వెంటపడి పట్టుకున్నారు. తహసీల్దార్ సమక్షంలో గంజాయిని స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశారు. కేసులో 3వ నిందితుడిగా చిరంజీవి పరారీలో ఉన్నాడని, కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.