మహిళలకు ఫ్రీ బస్ ఎఫెక్ట్.. ప్రభుత్వానికి ఆటో డ్రైవర్ల హెచ్చరిక

కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా మహిళలు లబ్ధిపొందుతున్నారు.. కానీ వేలాది కుటుంబాలు నష్టపోతున్నారని వాపోతున్నారు. కాబట్టి మహాలక్ష్మి స్కీమ్ ను రద్దు చేయాలి.. లేకపోతే తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

డ్రైవర్లుపై ఉన్న అన్ని రకాల ట్యాక్స్ లను రద్దుచేసి.. తమకు ప్రతి నెల పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. 

జగిత్యాల జిల్లాలో ఆటో, జీపు, టాటా మాజిక్ డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. మెట్ పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలకు చెందిన ఆటో, జీప్, టాక్సీ డ్రైవర్లు మెట్ పల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. 
పాత బస్టాండ్ చౌరస్తాలో సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ.. ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ అధికారికి వినతి పత్రం అందజేశారు.