
హైదరాబాద్, వెలుగు: వాహన డ్రైవింగ్ లైసెన్స్ పొందాలన్నా, కొత్త వెహికిల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా.. ఇక నుంచి ట్రాన్స్‌పోర్టు ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచే డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు, వాహనం కోనుగోలు చేసిన షోరూం నుంచే వెహికిల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. మార్చి మొదటి వారం నుంచి ఆన్ లైన్లో ఈ సేవలు రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మొదట సికింద్రాబాద్ ఆర్టీఏ ఆఫీసులో ఈ సేవలను ప్రయోగాత్మకంగా అందించనున్నారు. తర్వాత దశలవారీగా అన్ని జిల్లాల్లోని ఆర్టీఏ ఆఫీసుల్లో విస్తరించేందుకు రవాణా శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘వాహన్’, ‘సారథి’ పోర్టల్‌లతో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం కావడంతో తెలంగాణలో ఈ ఆన్ లైన్ ప్రక్రియ అందుబాటులోకి రానుంది. కేంద్ర రోడ్లు, రవాణా, జాతీయ రహదారుల శాఖ గతంలోనే దేశవ్యాప్తంగా ఆన్ లైన్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కాకుండా దేశంలోని అన్ని వాహనాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకేచోట ఉంచేందుకు వీలుగా ఈ పోర్టల్‌ను రూపొందించింది. అదే వాహన్, సారథి పోర్టల్‌లు. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ద్వారా అన్ని రాష్ట్రాల వాహనాల సమాచార బదిలీ ప్రక్రియ ఈ పోర్టల్‌ల ద్వారా సాఫీగా సాగనుంది.
దీంతో వివిధ అవసరాల కోసం వాహనాదారులు ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లకుండా ఆన్ లైన్లోనే తమ పనులు చేసుకునేందుకు ప్రవేశపెట్టిన ఈ పోర్టల్‌లో చేరాలని అన్ని రాష్ట్రాలను సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశించింది. 2016లో అమల్లోకి వచ్చిన ఈ పోర్టల్‌తో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అనుసంధానమై ఆన్ లైన్ విధానంలోనే సేవలు అందిస్తున్నాయి. అయితే.. ఒక్క తెలంగాణ మాత్రం ఈ పోర్టల్‌లో చేరలేదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేంద్రం పోర్టల్‌లో చేరేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఇప్పుడు మన రాష్ట్రంలోనూ ఆన్ లైన్లో రవాణా శాఖకు సంబంధించిన అన్ని పనులను ఇంటి నుంచే చేసుకోవచ్చని ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు.
కేంద్రం అమలు చేస్తున్న రెండు రకాల పోర్టల్‌లో వాహన్ మొదటిది కాగా.. సారథి రెండోది. వాహన్ పోర్టల్ ద్వారా వెహికిల్స్ రిజిస్ట్రేషన్లు, ఇతర ప్రాంతాలకు వాహనాల బదిలీ, యజమానుల పేరు మార్పు వంటివి ఆన్ లైన్లోనే చేసుకోవచ్చు.
కొత్తగా వెహికిల్ కొనుగోలు చేస్తే, సంబంధిత షోరూంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఇక ఉండదని ట్రాన్స్‌పోర్టు అధికారులు అంటున్నారు. రెండో పోర్టల్ సారథి ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. గడువు ముగిసిన లైసెన్స్‌ను ఆన్ లైన్ లోనే రెన్యువల్ చేసుకోవచ్చు. కాగా.. డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ, వాహన రిజిస్ట్రేషన్ లో ఇంతకాలం జరుగుతున్న పలు అవినీతి, అక్రమాలకు ఈ పోర్టల్స్ తో ఇక చెక్ పడనుంది.