ఔటర్తో పాటు 28 మున్సిపాలిటీల్లో డ్రోన్, లైడార్​ సర్వే.. డెవలప్​మెంట్​ కోసం సర్కార్ కొత్త ప్లాన్​

ఔటర్తో పాటు 28 మున్సిపాలిటీల్లో డ్రోన్, లైడార్​ సర్వే.. డెవలప్​మెంట్​ కోసం సర్కార్ కొత్త  ప్లాన్​
  • 2,053 చ. కి.మీ. ప్రాంతాన్ని వీడియో తీసి డిజిటలైజేషన్​ 
  • నోడల్​ ఏజెన్సీగా హెచ్ఎండీఏ 
  • డెవలప్​మెంట్​ కోసం ప్లాన్​తో ముందుకు పోతున్న సర్కారు 
  •  మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ముందడుగు 

హైదరాబాద్​సిటీ, వెలుగు :  ఔటర్​తో పాటు దాని పరిసరాల్లోని మున్సిపాలిటీలను కలిపి ‘తెలంగాణ కోర్​అర్బన్​ రీజియన్​(టీసీయూఆర్)’ అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. పూర్తి ఏరియాను లైడార్, డ్రోన్​సర్వే చేయించేందుకు సిద్ధమైంది. దీని కోసం హెచ్ఎండీఏ నోడల్​ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఇప్పటికే బల్దియా ఏడాదిగా తన పరిధిలోని ఆస్తుల మ్యాపింగ్ కోసం జియోగ్రాఫికల్​ఇన్ఫర్మేషన్​సిస్టమ్​(జీఐఎస్) సర్వే చేస్తోంది. అదే తరహాలో హెచ్ఎండీఏ కూడా డ్రోన్​అండ్​ లైడార్ సర్వే చేయించబోతోంది. డ్రోన్ సర్వేలో డ్రోన్ కు ఒకే కెమెరా ఉంటుంది. లైడార్ సర్వేలో విమానం లాంటి డ్రోన్ కు ఐదు కెమెరాలుంటాయి. ఇది గాలిలో చక్కర్లు కొడుతూ ఆయా ప్రాంతాల్లోని దృశ్యాలను 360 డిగ్రీస్ లో వీడియో తీస్తుంది. 

సర్కారు దృష్టి అంతా ఔటర్​పైనే..

ప్రస్తుతం ప్రభుత్వం దృష్టంతా ఓఆర్ఆర్​పరిసర ప్రాంతాలు, ట్రిపుల్​ఆర్​డెవలప్​మెంట్​పైనే ఉంది. భవిష్యత్​లో ఆయా ప్రాంతాలు భారీ ఎత్తున అభివృద్ధి సాధించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్లాన్​ప్రకారం ముందుకు పోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ముందుగా ఓఆర్ఆర్​లోపల ఉన్న 28 మున్సిపాలిటీల కలిపి 2,053 చ, కి.మీ. భూభాగాన్ని సర్వే చేయాలని నిర్ణయించి పనులను హెచ్ఎండీఏకు అప్పగించింది. బల్దియా ఇప్పటికే ఆస్తుల మ్యాపింగ్​చేసి ఆస్తిపన్ను కచ్చితంగా వసూలు చేసే ప్రక్రియను కొనసాగిస్తోంది. అందులో భాగంగానే డ్రోన్​సర్వేలు చేయిస్తోంది. కానీ, హెచ్ఎండీఏ ఏకంగా డ్రోన్​, లైడార్​సర్వే చేయాలని నిర్ణయించింది. 

సర్వే ఎందుకంటే..

ఓఆర్ఆర్​ పరిధిలోని అన్ని ప్రాంతాలను డ్రోన్, లైడార్​సర్వే చేయించడం వల్ల ఆయా ఏరియాల్లోని ప్రతి అంశాన్ని కచ్చితత్వంతో గుర్తించి డిజిటల్​రూపంలో రికార్డు చేయవచ్చని అధికారులు చెప్తున్నారు. దీనిద్వారా ఆయా ప్రాంతాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఫ్యూచర్​ సిటీ కూడా అభివృద్ధి చేయాలనుకుంటున్న నేపథ్యంలో ఈ సర్వే అయా ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్​, కమ్యూనికేషన్, ఇతర అన్ని రకాల వసతుల కల్పనకు ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. 

ప్రత్యేక కమిటీల ఏర్పాటు 

సర్వే సందర్భంగా శాఖల మధ్య సమన్వయం, ఇతర సహకారం కోసం ప్రభుత్వం రెండు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో హెచ్ఎండీఏ కమిషన్​చైర్మన్​గా, బల్దియా కమిషనర్​వైస్​చైర్మన్​గా, డైరెక్టర్​టౌన్​ప్లానింగ్​అండ్​కంట్రీప్లానింగ్​(డీటీసీపీ) మెంబర్​కన్వీనర్ గా, మెట్రోవాటర్ బోర్డు, టీజీఐఐసీ, ఐఐటీ హైదరాబాద్​తదితరులు మెంబర్లుగా ఒక కమిటీ, వర్కింగ్​కమిటీకి రాష్ట్ర చీఫ్​సెక్రటరీ చైర్మన్​గా, హెచ్ఎండీఏ కమిషనర్​కన్వీనర్​గా మరో కమిటీ ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. హెచ్ఎండీఏ త్వరలోనే ఆయా ప్రాంతాల్లో డ్రోన్, లైడార్​సర్వే నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుందని, దాని ఆధారంగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ఏ విధంగా నిర్వహించాలన్న దానిపై సీఎం నిర్ణయం తీసుకుంటారని అధికారులు తెలిపారు.