బ్యాంకాక్: మయన్మార్ నుంచి బోటులో తరలి వెళ్తున్న రోహింగ్యా ముస్లింలపై డ్రోన్ దాడి జరగడంతో డజన్ల కొద్ది మంది మరణించారు. మాంగ్ డా పట్టణం నుంచి నాఫ్ నది గుండా బంగ్లాదేశ్ లోకి ప్రవేశించేందుకు వారు ప్రయత్నించగా ఈ దాడి జరిగింది. సోమవారం రఖైన్ రాష్ట్రంలో ఈ విషాదం చోటు చేసుకుంది. గత కొన్ని వారాలుగా మయన్మార్ మిలటరీ (జుంటా), అరాకన్ ఆర్మీ(రెబెల్స్) కు మధ్య భీకర పోరు జరుగుతోంది.
ఈ క్రమంలోనే రోహింగ్యాలు పారిపోతుండగా వారిపై దాడి జరిగింది. అరాకన్ ఆర్మీ ఈ దాడి చేసిందని శనివారం కొంత మంది సాక్ష్యులు తెలిపారు. కానీ, ఆ సంస్థ మాత్రం ఆరోపణలను ఖండించింది. జుంటా, రెబెల్స్ ఎవరు కూడా ఈ దాడికి బాధ్యత వహించలేదు. ఈ ప్రమాదంలో దాదాపుగా 200 మందికి పైగా మరణించారని తెలుస్తోంది.
మృతుల సంఖ్య చెప్పలేం: యునైటెడ్ నేషన్స్
ప్రపంచవ్యాప్తంగా వైద్య సేవలు అందించే డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ ఈ ప్రమాదంపై ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘‘మయన్మార్ నుంచి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న వారు మోర్టార్ షెల్, గన్ షాట్స్ దాడికి గురై తీవ్రంగా గాయపడుతున్నారు. గత వారం రోజుల్లోనే మేం 39 మందికి చికిత్స అందించాం” అని తెలిపింది. యునైటెడ్ నేషన్స్ హైకమిషన్ ఫర్ రెఫ్యూజీస్ అధికార ప్రతినిధి కూడా ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘‘బోటు ప్రమాదంలో ఎంతమంది మరణించారో కచ్చితంగా చెప్పలేం”అని చెప్పారు.
భారీగా వలస వెళ్తున్న రోహింగ్యాలు
మయన్మార్‌లో మిలటరీ పాలన వచ్చాక దేశంలో మైనారిటీలుగా ఉన్న తమపై అణచివేత మొదలైందని రోహింగ్యాలు వాపోతున్నారు. దీనిని తట్టుకోలేక పెద్ద సంఖ్యలో దేశం వదిలి వెళుతున్నట్లు వివరించారు. 2017 నుంచి 7. 30 లక్షల మంది మయన్మార్ ను వదిలి వెళ్లారని యూఎన్ ఓ రిపోర్టులో పేర్కొంది.