డ్రోన్ బాంబుతో.. హైరైజ్ టవర్స్ పై దాడులు : రష్యాపై ఉక్రెయిన్ వ్యూహాత్మక దాడి

డ్రోన్ బాంబుతో.. హైరైజ్ టవర్స్ పై దాడులు : రష్యాపై ఉక్రెయిన్ వ్యూహాత్మక దాడి

టెక్నాలజీ ఏ రేంజ్ లో ఉందో.. ఉక్రెయిన్ ప్రయోగించిన బాంబులతో స్పష్టం అయ్యింది. డ్రోన్ టెక్నాలజీతో.. డ్రోన్ బాంబులతో రష్యాను ఉక్కిరిబిక్కిరి చేసింది ఉక్రెయిన్. 2024, ఆగస్ట్ 26వ తేదీ ఉదయం.. రష్యాలోని సరతోవ్ ఏరియాను టార్గెట్ చేసింది ఉక్రెయిన్.. ఈ క్రమంలోనే భారీ బాంబును అమర్చిన డ్రోన్ ను ప్రయోగించింది. ఈ డ్రోన్ బాంబ్.. రష్యాలోని సరతోవ్ ఏరియాలోని 38 అంతస్తుల ఓల్గా అనే భారీ హైరైజ్ రెసిడెన్షియల్ టవర్స్ ను ఢీకొట్టింది. 

డ్రోన్ బాంబు ధాటికి 38 అంతస్తుల భవనంలోని ఐదు అంతస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. డ్రోన్ బాంబు దాడిలో బిల్డింగ్ అద్దాలు పగిలిపోయాయి. అందులో నివాసం ఉంటున్న ఓ మహిళ చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. చాలా మంది గాయపడ్డారు. బిల్డింగ్ అద్దాలు కింద పడి.. పార్క్ చేసిన వందల వాహనాలు దెబ్బతిన్నాయి. 

డ్రోన్ బాంబ్ దాడిలో 38 అంతస్తుల భవనం దెబ్బతిన్నా.. కూలిపోలేదు. ఈ దాడి విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పట్లో అమెరికాలోని ట్విన్ టవర్స్ దాడి తరహాలోనే ఈ దాడి జరిగిందని.. కాకపోతే అప్పుడు విమానాలు వరసగా ఢీకొట్టాయని.. ఇప్పుడు బాంబులతో ఉన్న డ్రోన్ ఢీకొట్టిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఉక్రెయిన్ దాడిపై రష్యా స్పందించింది. సామాన్య ప్రజలను టార్గెట్ చేయకూడదనే నిబంధన ఉన్నా.. గత రెండు నెలల్లో ఇలాంటి దాడులు ఉక్రెయిన్ తరచూ చేస్తుందని.. ఇప్పటికే ఆరుగురు పౌరులు చనిపోయారని వెల్లడించింది. ఉక్రెయిన్ కు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించింది. ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్ బాంబు తర్వాత రష్యా సైన్యం అప్రమత్తం అయ్యింది. యుద్ధ విమానాలతో గస్తీ పెంచింది. ఉక్రెయిన్ డ్రోన్లును కూల్చివేసే పని ప్రారంభించింది.