వర్ధన్నపేట(ఐనవోలు), వెలుగు: పంటలకు పురుగు మందులు కొట్టేందుకు రైతులు పడే సమస్యలను అధిగమించేందుకు నాబార్డ్ దృష్టి సారించింది. క్లైమెట్ ఛేంజ్ ఫండ్- ఇంటరెస్ట్ డిఫరెన్షియల్ కింద పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. నాబార్డ్, కోర్ కార్బన్ ఎక్స్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్(సీసీఎక్స్) సంయుక్తగా పోతన ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా రెండేండ్ల పాటు ప్రాజెక్టును అమలు చేస్తారు. ఇందుకు రూ. 45.04 లక్షల ఖర్చును నాబార్డ్ భరించనుంది. గ్రాంట్ కింద రూ. 26 . 97 లక్షలు, మిగిలిన రూ. 18 .07 లక్షలను ఎఫ్ పీవోలు, సీసీఎక్స్ ద్వారా సహకారం అందిస్తారు. డ్రోన్ల కొనుగోలుకు రైతులకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాం క్, నాప్కామ్ ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తారు.
రైతులకు చాలా ప్రయోజనాలు
వ్యవసాయంలో డ్రోన్ల వాడకంతో రైతులకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా పురుగుమందులు చల్లడం రైతులకు ఈజీ అవుతుంది. ఒక ఎకరాకు గంట, రెండు గంటలు సమయం పడుతుంది. డ్రోన్ ను వాడితే 10 నిమిషాల్లో పూర్తవుతుంది. డ్రోన్ ద్వారా పొలం అంతా సమానంగా మందు చల్లవచ్చు. రోజులో 20 - 30 ఎకరాలకు కొట్టొచ్చు. క్రిమిసంహారక మందులు చల్లినప్పుడు రైతులు విషగాలి పీల్చి అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉండదు. పంటల తెగుళ్లు, చీడ పీడలను నివారించి ఉత్పత్తులను పెంచడానికి డ్రోన్లు ఎంతో ఉపయోగపడతాయి.
నందనంలో డ్రోన్ ప్రాజెక్ట్ లాంచింగ్
వ్యవసాయంలో డ్రోన్ల వాడకానికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టును మంగళవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనంలో నాబార్డ్ తెలంగాణ సీజీఎం చింతల సుశీల ప్రారంభించారు. డ్రోన్ ను లాంచింగ్ చేసి ఎలా పని చేస్తుందో రైతులకు అవగాహన కల్పించారు. ప్రాజెక్టు ద్వారా రైతు ఉత్పత్తిదారుల సంస్థ, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ (ఎఫ్ పీఓ) ల ద్వారా డ్రోన్లను అందజేస్తారు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని 3 రైతు ఉత్పత్తిదారుల సంస్థల(ఎఫ్ పీఓ)లకు సంబంధించి 1500 మంది రైతులకు ప్రయోజనం కలగనుంది.
ఇప్పటికే కార్నర్ సద్గురు ఫౌండేషన్ ద్వారా 24 మంది పైలట్లను ఎంపిక చేసి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్ మెంట్ లో 12 రోజులు శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు 3 శాతం వడ్డీకే రుణాలు అందిస్తుందని నాబార్డ్ సీజీఎం చింతల సుశీల తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఐనవోలు, నెక్కొండ, హసన్ పర్తి, జాఫర్ గఢ్ మండలాల్లోని రైతు ఉత్పత్తి దారుల సంఘాలకు రూ.34.8 లక్షల రుణాలు అందించామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కో – ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, నాబార్డ్ డీజీఎం స్వాతి తివారి, నాబార్డ్ డీఏం చంద్రశేఖర్, ఏపీజీవీబీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, సీసీఎక్స్ కంపెనీ చైర్మన్ నీరజ్ మహంతి, ఎఫ్ పీఓ వాటాదారులు, 5 ఎఫ్ పీఓల డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.