
- డ్రోన్షోలో మంత్రి శ్రీనివాస్ గౌడ్
సిద్దిపేట, వెలుగు : దేశంలో ఎక్కడ ఏ అద్భుతమున్నా దాన్ని తెచ్చి అభివృద్ధికి ఐకాన్ గా సిద్దిపేటను మార్చారని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం రాత్రి సిద్దిపేట కోమటి చెరువు వద్ద నిర్వహించిన డ్రోన్ షో కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యం, విద్యా రంగాల్లో సిద్దిపేట ముందున్నదన్నారు. ఉద్యమ సమయంలో హరీశ్‌రావు స్ఫూర్తి తో తామంతా జనంలో నడిచామని, పని చేసే విషయంలో ఇప్పటికీ ఆయనే తమకు స్ఫూర్తి అని తెలిపారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ సిద్దిపేట వాసులకు డ్రోన్ షో చూపాలన్న తన కల నేడు సాకారం అయ్యిందన్నారు. కోమటి చెరువు నిండా గోదావరి నీళ్ల చేరాయని, వచ్చే నెల రోజుల్లొనే సిద్దిపేటకు రైలు రాబోతుందని తెలిపారు.
రంగనాయక సాగర్ రానున్న రోజుల్లో దేశంలోనే ఒక డెస్టినేషన్ సెంటర్ గా రూపొందబోతోందని, రానున్న దసరా నాటికి నెక్లెస్ రోడ్ పూర్తవుతుందని తెలిపారు. కోమటి చెరువులో స్కై రెస్టారెంట్, టన్నెల్ అక్విరేయం, వర్చువల్ రియాలిటీ డోమ్ థియేటర్ తో పాటు ఎసీ ఇండోర్ స్టేడియంను మంజూరు చేయాలని ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా స్థానిక అంశాలతో దాదాపు 20 నిమిషాల పాటు సాగిన డ్రోన్ షో అలరించింది.
కార్యక్రమాన్ని చూడటానికి దాదాపు 20 వేల మంది కోమటి చెరువు కు తరలివచ్చారు. ఎలాంటీ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా జడ్జీ రఘురాం, సీపీ ఎన్.శ్వేత, జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల లు పాల్గొన్నారు.