
- ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ ఆరోపణ
- రేడియేషన్ స్థాయిలోమార్పులేదని వెల్లడి
- అది తమ మిలిటరీ పని కాదన్న రష్యా
కీవ్: ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్టర్‌పై డ్రోన్లతో రష్యా విరుచుకుపడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ రియాక్టర్‌పై రష్యా హై ఎక్స్‌ప్లోజివ్ వార్‌హెడ్‌తో కూడిన డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ ఆరోపించారు. నాలుగో రియాక్టర్ నుంచి వెలువడే రేడియేషన్వ్యాప్తిచెందకుండా ఏర్పాటుచేసిన షెల్టర్‌పై రష్యా దాడిచేసినట్టు చెప్పారు. మంటలు చెలరేగగా.. సిబ్బంది ఆర్పేశారని తెలిపారు. కాంక్రీట్ షెల్టర్ కొంత దెబ్బతిన్నదని చెప్పారు. అయితే, అక్కడ రేడియేషన్ లెవల్స్ పెరుగలేదని, సాధారణ స్థాయిలోనే ఉన్నాయని జెలెన్‌స్కీతోపాటు యునైటెడ్ నేషన్స్ అటామిక్ ఎనర్జీ తెలిపాయి. షెల్టర్ చాలా వరకు దెబ్బతిన్నదని, ఈ ప్రాంతంలో నిశితంగా పరిశీలన చేపట్టామని, సిబ్బందిని అప్రమత్తం చేశామని జెలెన్‌స్కీ వెల్లడించారు.
తమతో చర్చలకు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ సిద్ధం కాలేదనడానికి తాజా డ్రోన్ దాడే నిదర్శనమని మండిపడ్డారు. ఇలాంటి కీలకమైన సంస్థలు, ప్రాంతాలపై దాడిచేసేందుకూ వెరవని దేశం ప్రపంచంలో రష్యా ఒక్కటేనని ఆరోపించారు. న్యూక్లియర్ రియాక్టర్లపై దాడుల వల్ల కలిగే దుష్పరిణామాలనూ లెక్కచేయడంలేదని, ఇది ప్రపంచం మొత్తానికీ ఉగ్ర ముప్పేనని జెలెన్ స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా తాను చేస్తున్న పనులకు జవాబుదారీగా ఉండాలని హెచ్చరించారు.
మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌కు కొన్ని గంటల ముందే..
రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌ను కలిసి యుద్ధం ముగింపు కోసం చర్చిస్తానని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన రెండు రోజులకే అణు రియాక్టర్‌పై డ్రోన్ దాడి జరిగింది. అలాగే, ఉక్రెయిన్సంక్షోభంపై జర్మనీలోని మ్యూనిచ్‌లో సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ప్రారంభం కావడానికి కొన్ని గంటలముందే ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది. ఈ సదస్సులో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భేటీ కానున్నారు. అణు రియాక్టర్‌పై రష్యా దాడిని ఈ సందర్భంగా చర్చించాలని ఉక్రెయిన్ భావిస్తున్నది. ఇదిలా ఉండగా, న్యూక్లియర్రియాక్టర్పై జరిగిన డ్రోన్ దాడిపై రష్యా స్పందించింది. తమ మిలిటరీ అలా చేయదని ఆ దేశ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలను అడ్డుకునేందుకే ఉక్రెయిన్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నదని మండిపడ్డారు.