జోధ్ పూర్: సెక్యూరిటీ పరంగా బార్డర్ లో డ్రోన్లు సవాళ్లు విసురుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వీటి ముప్పు రానున్న రోజుల్లో మరింత పెరగనుందని చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి డీఆర్ డీవో, ఇతర సంస్థలు కలిసి పని చేస్తున్నాయని తెలిపారు. త్వరలోనే సమగ్ర యాంటీ డ్రోన్ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) 60వ రైజింగ్ డే వేడుకలు ఆదివారం రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా జవాన్లకు గ్యాలంటరీ అవార్డులను అమిత్ షా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా ఇండియా, పాకిస్తాన్ బార్డర్ లో డ్రోన్లతో సెక్యూరిటీ పరంగా సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు.
‘‘పాక్ బార్డర్ లో ఏర్పాటు చేసిన లేజర్ ఎక్విప్ డ్ యాంటీ డ్రోన్ గన్ మౌంటెడ్ మెకానిజంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇది శత్రు దేశాలు పంపుతున్న డ్రోన్లను గుర్తించి, కూల్చివేసేందుకు దోహదపడుతున్నది. ఇలాంటి కేసులు పాక్ బార్డర్ లోని పంజాబ్ లో 3 శాతం నుంచి 55 శాతానికి పెరిగాయి” అని తెలిపారు. ‘‘పాక్, బంగ్లా బార్డర్లో కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ బార్డర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ పురోగతిలో ఉంది. దీన్ని మరింత మెరుగుపరచాలి. ఉత్తరాదిలోని సరిహద్దు గ్రామాల అభివృద్ధికోసం తెచ్చిన వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్ను దేశవ్యాప్తంగా అన్ని సరిహద్దు గ్రామాల్లో అమలు చేస్తాం” అని ప్రకటించారు. కొత్తగా 573 బార్డర్ పోస్టులను ఏర్పాటు చేశామని అమిత్ షా చెప్పారు.