బార్డర్ దాటి మెల్లగా వస్తయి. తక్కువ ఎత్తులో ఎగురుకుంటూ వచ్చి రాడార్ల కండ్లు గప్పుతయి. సైలెంట్ గా వచ్చి బాంబులేసి పోతయి. అనేక దేశాల ఆర్మీలు ఇప్పుడు విస్తృతంగా వాడుతున్న ఈ వెపన్సే డ్రోన్స్. ఇప్పటి వరకూ సర్వయిలెన్స్ కోసమే డ్రోన్లు ఉపయోగపడేవి. కానీ వీటిని ఇప్పుడు అభివృద్ధి చేసి యుద్ధాల కోసం కూడా వాడేలా డిజైన్ చేస్తున్నారు. వీటిలో చిన్న పాటి విమానాల్లా ఉండే అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీ) కొన్ని అయితే.. నాలుగు ఫ్యాన్లతో పక్షిలా ఎగురుకుంటూ వచ్చే క్వాడ్ కాప్టర్ లు మరికొన్ని ఉంటాయి. సుమారు దశాబ్దం కాలం నుంచే డ్రోన్స్ అనేక దేశాల మిలిటరీల చేతుల్లో ఉన్నా.. ఇటీవలి కాలంలోనే వీటి వాడకం బాగా పెరిగింది. అన్ని దేశాల వద్దా వీటి సంఖ్య పెరగడంతో డ్రోన్ లతో కొత్త రీతిలో యుద్ధాలు జరిగే రోజులు వచ్చాయి.
అన్ని దేశాల వద్దా మిలిటరీ డ్రోన్స్
లండన్ కు చెందిన ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ (ఐఐఎస్ఎస్) విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం, ఇజ్రాయెల్, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ వంటి11 ప్రధాన దేశాల్లో 56 రకాల మిలిటరీ డ్రోన్ లు ఉన్నాయి. మొత్తం 807 యూఏవీలు యాక్టివ్ సర్వీస్ లో ఉన్నట్లు అంచనా. చైనా, టర్కీ, ఇరాన్, రష్యా వంటి చాలా దేశాల్లోని మిలిటరీ డ్రోన్ లకు సంబంధించిన డేటా సీక్రెట్ గా ఉంది. దీంతో మిలిటరీ డ్రోన్ ల సంఖ్య గురించి తెలిసింది తక్కువేనని, ఇంకా తెలియకుండా వేల సంఖ్యలో డ్రోన్లు ఉంటాయని చెప్తున్నారు. ఐఐఎస్ఎస్ లెక్కల ప్రకారం, మిలిటరీ డ్రోన్ ల సంఖ్యలో అమెరికా టాప్ లో ఉంది. యూఎస్ లో 18 రకాలకు చెందిన 678 డ్రోన్ లు సర్వీస్ లో ఉన్నాయని అంచనా. వీటిలో ప్రిడేటర్ డ్రోన్ లే పెద్ద మొత్తంలో ఉన్నాయని పేర్కొంటున్నారు. బ్రిటన్ ఆర్మీ వద్ద హెర్మెస్ 450, వాచ్ కీపర్ డ్రోన్ లు, రీపర్ హెవీ డ్రోన్ లు ఉన్నాయని చెప్తున్నా, అసలు లెక్కలు మాత్రం బయటకు రావడంలేదు. ఇక మిలిటరీ డ్రోన్ ల తయారీ, అమ్మకంలో ఇజ్రాయెల్ టాప్ లో ఉంది. అమెరికా, ఇండియా సహా చాలా దేశాలు ఇజ్రాయెల్ నుంచి డ్రోన్ లను కొంటున్నాయి లేదా ఆ దేశ టెక్నాలజీతోనే డ్రోన్ లను తయారు చేసుకుంటున్నాయి.
జమ్మూలో ఇటీవల మన ఎయిర్ బేస్ పై డ్రోన్ దాడులు జరగడం, రోజూ డ్రోన్ లు ఎగురుతూ కన్పిస్తూనే ఉండటంతో వీటితో మున్ముందు భారీ ముప్పు పొంచి ఉందన్న విషయం తేలిపోయింది. ఈ నేపథ్యంలో డ్రోన్ అటాక్ లను ఎదుర్కొనేందుకు మన దేశం సిద్ధంగా ఉందా? మిలటరీ డ్రోన్ లను సమకూర్చుకోవడంలో మనం ఎక్కడున్నాం? అన్న చర్చలు జోరందుకున్నాయి. ఇప్పటివరకూ నిఘా అవసరాల కోసమే ఎక్కువగా డ్రోన్ లను ఉపయోగిస్తున్న మన రక్షణ శాఖ.. మిలటరీ డ్రోన్ ల సంఖ్య పెంచుకోవడంపై ఇప్పుడిప్పుడే దృష్టి సారిస్తోంది.
మన వద్ద ఉన్న డ్రోన్లు ఇవే..
ఇప్పటివరకూ మన వద్ద నిఘా కోసం వాడుతున్న డ్రోన్ లే ఎక్కువగా ఉన్నాయి. ఇజ్రాయెల్, అమెరికా నుంచి డ్రోన్ లను కొని లేదా లీజ్ కు తీసుకుని మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వాడుతున్నాయి. మరిన్ని డ్రోన్ లను కొనడంతో పాటు సొంతంగా మిసైల్స్, బాంబులు ప్రయోగించే మిలిటరీ డ్రోన్ లను సమకూర్చుకునేందుకు రక్షణ శాఖ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇవే కాకుండా రక్షణ శాఖ సొంతంగా తయారు చేసుకున్న 75 స్వార్మ్ డ్రోన్లు ఉన్నాయి. నిఘాతో పాటు కంబాట్ కెపాసిటీ ఉన్న ఈ డ్రోన్ లను జనవరి 15న ఆర్మీ డే పరేడ్ లో సక్సెస్ ఫుల్ గా ఉపయోగించారు. ఇవి 500 మీటర్ల దూరంలోని టార్గెట్లపై కూడా అటాక్ చేయగలవని చెప్తున్నారు.
అమెరికా నుంచి ప్రిడేటర్ డ్రోన్లు
అమెరికా నుంచి 30 ప్రిడేటర్ డ్రోన్ (ఎంక్యూ 9 రీపర్)లను కొనుగోలు చేసేందుకు మన రక్షణ శాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు ఎంక్యూ–9 డ్రోన్ లను లీజ్ కు తీసుకుని, వాటి పనితీరును పరిశీలించిన నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ.. శాటిస్ ఫై అయ్యాయి. చైనా, పాకిస్తాన్ వద్ద ఉన్న వింగ్ లూంగ్ 2 డ్రోన్ లకు దీటుగా ప్రిడేటర్ డ్రోన్ లు పనికొస్తాయని చెప్తున్నారు. లక్ష్యాలను కచ్చితత్వంగా ధ్వంసం చేసే వింగ్ లూంగ్ 2 డ్రోన్ లకు వీటితో అయితేనే దీటైన జవాబు చెప్పొచ్చని భావిస్తున్నారు. దశలవారీగా 30 ప్రిడేటర్ డ్రోన్ లను కొనుగోలు చేసి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు అందజేయాలని రక్షణ శాఖ యోచిస్తోంది. గైడెడ్ బాంబులు, హెల్ ఫైర్ మిసైల్స్ ప్రధాన వెపన్స్ గా ఉండే ప్రిడేటర్ డ్రోన్ లు లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించడంలో ఇప్పటికే సత్తా చాటాయి.
ఇజ్రాయెల్ నుంచి హెరాన్ డ్రోన్లు
మన రక్షణ శాఖ ఇప్పటికే ఇజ్రాయెల్ నుంచి పలు హెరాన్ డ్రోన్ లను లీజ్ కు తీసుకుంది. ఇప్పుడు వాటి స్థానంలో కొత్తగా 6 హెరాన్ హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్ లను లీజ్ కు తీసుకోనుంది. ప్రస్తుత హెరాన్ డ్రోన్ లను డాటా లింక్, బెటర్ రాడార్లతో అప్ గ్రేడ్ చేసేందుకు కూడా కసరత్తు మొదలుపెట్టింది.
డీఆర్డీవో యాంటీ డ్రోన్ సిస్టం రెడీ
శత్రు డ్రోన్ లను నేలకూల్చేందుకు డీఆర్డీవో కౌంటర్ డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. లేజర్ ఆధారంగా పని చేసే ఈ యాంటీ డ్రోన్ సిస్టం శత్రు యూఏవీలను గాల్లోనే పేల్చేస్తుంది. మూడు కిలోమీటర్ల పరిధిలో ఎగురుతూ వచ్చే మైక్రో డ్రోన్ లను ఇది గుర్తిస్తుంది. పెద్ద డ్రోన్ లు అయితే 12.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నా గుర్తించి, లేజర్ సిగ్నల్స్ తో పేల్చేస్తుంది. ఈ సిస్టంను నిరుడు ఇండిపెండెన్స్ డే రోజున, అహ్మదాబాద్ కు ట్రంప్ వచ్చిన సందర్భంగా, ఈ ఏడాది రిపబ్లిక్ డే రోజున మాత్రమే ఆర్మీ ఉపయోగించింది.
2024 నాటికి డీఆర్డీవో ఘాతక్
ఎయిర్ ఫోర్స్ కోసం డీఆర్డీవో అభివృద్ధి చేస్తున్న పవర్ ఫుల్ మిలిటరీ డ్రోన్ ఇది. శత్రు దేశాల రాడార్లకు చిక్కకుండా ఎగిరేలా దీని రెక్కలను డీఆర్డీవో డిజైన్ చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు సీక్రెట్ గా ఉన్నాయి. టార్గెట్ లపై కచ్చితత్వంతో బాంబులను జార విడవడం, మిసైల్స్ ను ప్రయోగించే సత్తా దీని సొంతం. ఈ ఏడాదే తొలిసారి టెస్ట్ ఫ్లైట్ చేయనున్నారు. 2024 తర్వాతే ఇది పూర్తి స్థాయిలో సిద్ధం కానుంది. అన్ మ్యాన్డ్ కంబాట్ ఏరియల్ వెహికల్ (యూసీఏవీ) రకానికి చెందిన ఘాతక్ నిఘా సమాచారం సేకరిస్తూనే.. శత్రు స్థావరాలపై గైడెడ్ మిసైల్స్, బాంబులు వేయగలదు.
వరల్డ్ టాప్ 5 వార్ డ్రోన్లు ఇవే..
ప్రిడేటర్ సీ అవెంజర్
అమెరికన్ ఆర్మీకి చెందిన జీఏ ఏఎస్ఐ సంస్థ వీటిని తయారు చేస్తోంది. వీటి రేంజ్ 2,900 కిలోమీటర్లు. పేలోడ్ కెపాసిటీ 2,948 కిలోలు. టాప్ స్పీడ్ గంటకు 740 కిలోమీటర్లు. ఆగకుండా 20 గంటలు ఎగురుతుంది. హెల్ ఫైర్ మిసైల్స్, లేజర్ గైడెడ్ బాంబులు, పేలుడు పదార్థాలు మోసుకుపోగలదు. తొలిసారిగా ఎగిరిన రోజు 2009, ఏప్రిల్ 4. ఈ రకమైన డ్రోన్లను అమెరికా మాత్రమే ఉపయోగిస్తోంది.
హెరాన్ టీపీ
ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ) హెరాన్ టీపీ వార్ డ్రోన్లను తయారు చేస్తోంది. దీని రేంజ్ 7,400 కిలోమీటర్లు. పేలోడ్ కెపాసిటీ 2,700 కిలోలు. టాప్ స్పీడ్ గంటకు 407 కిలోమీటర్లు. ఆగకుండా 30 గంటలు ఎగురుతుంది. మిసైల్స్ ను మోసుకుపోగలదు. తొలిసారిగా 2006, జులై 15 ఇది ఎగిరింది. ప్రస్తుతం హెరాన్ టీపీ డ్రోన్లను ఇజ్రాయెల్‌తో పాటు ఇండియా, గ్రీస్ తదితర దేశాలు ఉపయోగిస్తున్నాయి.
ఎంక్యూ9బీ స్కై గార్డియన్
అమెరికన్ ఆర్మీకి చెందిన జీఏ ఏఎస్ఐ సంస్థే దీనిని కూడా మాన్యుఫాక్చరింగ్ చేస్తోంది. దీని రేంజ్ 1,850 కిలోమీటర్లు. పేలోడ్ కెపాసిటీ 1,814 కిలోలు. టాప్ స్పీడ్ గంటకు 482 కిలోమీటర్లు. ఆగకుండా 40 గంటలు ఎగురుతుంది. గైడెడ్ బాంబులు, హెల్ ఫైర్ మిసైల్స్ ను ఇది మోసుకుపోగలదు. తొలిసారిగా 2001, ఫిబ్రవరి 2న ఇది ఎగిరింది. వీటిని అమెరికాతో పాటు బ్రిటన్, ఇటలీ కూడా వాడుతున్నాయి.
సీఏఐజీ వింగ్ లూంగ్ 2
చైనాకు చెందిన ఏవీఐసీ వీటిని రూపొందిస్తోంది. దీని రేంజ్ 1,500 కిలోమీటర్లు. పేలోడ్ కెపాసిటీ 480 కిలోలు. టాప్ స్పీడ్ గంటకు 370 కిలోమీటర్లు.ఆగకుండా 32 గంటలు ఎగురుతుంది.లేజర్ గైడెడ్ బాంబులు, మిసైల్స్ ను మోసుకుపోతుంది. ఫస్ట్ ఫ్లైట్ 2017, ఫిబ్రవరి. చైనా, పాకిస్తాన్, యూఏఈ, సౌదీ అరేబియా వీటిని వాడుతున్నాయి.
బేరక్టర్ టీబీ2
టర్కిష్ ఆర్మీకి చెందిన బేకర్ డిఫెన్స్ సంస్థ దీనిని తయారు చేస్తోంది. రేంజ్ 150 కిలోమీటర్లు.పేలోడ్ కెపాసిటీ 55 కిలోలు. టాప్ స్పీడ్ గంటకు 220 కిలోమీటర్లు. ఆగకుండా 27 గంటలు ఎగురుతుంది. మిసైల్స్, లేజర్ గైడెడ్ బాంబులు, రాకెట్లను మోసుకుపోగలదు. తొలిసారిగా 2014, ఆగస్ట్ లో ఇది ఎగిరింది. టర్కీ, లిబియా, పోలండ్, ఖతర్, తదితర దేశాలు వీటిని ఉపయోగిస్తున్నాయి.