విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వాలు పెట్టుబడులు పెంచాలని ఐక్యరాజ్య సమితి ప్రక టించిన కొద్ది నెలల్లోనే ప్రపంచ ఉత్తమ పాఠశాల ఎంపిక కోసం లండన్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. సంఘ సహకారం, పర్యావరణ పరిరక్షణ, కొత్త ఆవిష్కరణలు, ప్రతికూలతలను అధిగమించటం, ఆరోగ్యకరమైన ఆవిష్కరణలు.. ఈ ఐదు విభాగాల్లో ఎంపిక జరుగుతున్న నేపథ్యంలో మన దేశ పాఠశాలల తీరును సమీక్షించుకునే అవసరంఏర్పడిందిప్పుడు. స్వాతంత్ర్యం సాధించి 75 ఏండ్లు గడిచినా, విద్యాపరంగా ఇంకా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. సంస్కృతి మాటున అమలవుతున్న నమ్మకాలు, పేదరికం, అవగాహన రాహిత్యం, లింగ, కుల వివక్షత, అరకొర సౌకర్యాలు విద్యారంగాన్ని అధ్వాన స్థితిలోకి తీసుకెళ్తున్నాయి. 1966 నుంచి విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు చేపట్టినా సరైన ఫలితాలు అందిరావడం లేదు. పాఠశాలల్లో అరకొర సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, టీచర్ల కొరత తదితర కారణాలు విద్యార్థి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడంలో విఫలమవుతున్నాయి. డ్రాపౌట్లు పెరిగి సంపూర్ణ అక్షరాస్యత అందనంత దూరంగా జరుగుతున్నది.
టీచర్ల కొరత
పాఠశాల స్థాయిలో విద్యకు బలమైన పునాది వేస్తేనే స్టూడెంట్ భవిష్యత్తు బాగుంటుంది. యునెస్కో నిర్దేశం మేరకు సీనియర్ సెకండరీ విద్యలో ప్రతి 26 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. మన దేశంలో సగటున ప్రతి 47 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే పనిచేస్తున్నాడు. 1.10 లక్షల ఏకోపాధ్యాయ బడులు ఉన్నాయి. వాటిలో పనిచేసే టీచర్లు సెలవు పెట్టినప్పుడు అవి మూతపడాల్సిందే. దేశంలో 11 లక్షల మందికిపైగా టీచర్ల కొరత ఉన్నట్లు అంచనా. 2020 -– 21 ఏడాదిలో దేశంలో మొత్తం బడుల సంఖ్య15.09 లక్షలు ఉండగా, 2021– -22 నాటికి ఆ సంఖ్య 14.89 లక్షలకు తగ్గింది. ఈ ఏడాది ప్రాథమికస్థాయి నుంచి ప్రాథమికోన్నత పాఠశాలల్లోకి ప్రవేశాలు దాదాపు 25.57 కోట్ల మేర ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన తరగతుల విద్యార్థుల నమోదులో పెరుగుదల ఆశాజనకంగా ఉన్నది. టీచర్ల సంఖ్య 2020-–21 ఏడాదిలో 97.87 లక్షలు ఉండగా, 2021–-22 నాటికి ఈ సంఖ్య 95.07 లక్షలకు తగ్గింది. ఈ తగ్గుదల ప్రభుత్వ బడుల్లో 0.9 శాతం, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో1.45 శాతంగా ఉంది. బడుల్లో కంప్యూటర్లు, వాటి బోధన పరిస్థితి ఆశాజనకంగా లేదు. కొన్ని పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నా, బోధకులను నియమించకపోవడం, విద్యుత్తు సదుపాయం లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. ఐదు శాతం బడుల్లోనే సమాచార, సాంకేతిక పరిజ్ఞాన ప్రయోగశాలలు ఉన్నాయి.
ఫలితాలు రాబట్టడంపై దృష్టి పెట్టాలి..
తెలంగాణలో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న బడులు 30,023 ఉండగా, 1,40,295 మంది టీచర్లు, 10,689 బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. ఒక్కో బడిలో సగటున 4.6 మంది టీచర్లు, 0.35 బోధనేతర సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. కరోనా తర్వాత విద్యార్థుల నమోదు పెరిగినా, ప్రభుత్వ బడుల్లో టీచర్ల కొరత తీవ్రంగా ఉన్నది. రాష్ట్రంలో13.65 శాతం ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 11.23 శాతం ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. కంప్యూటర్ సౌకర్యం ఉన్నవి 8,296 (27.63 శాతం). రాష్ట్రంలో కేవలం 2,772 ప్రభుత్వ బడుల్లోనే ఇంటర్నెట్ సౌకర్యం(9.2 శాతం) ఉంది. ఈ విషయంలో మనకంటే వెనుకబడిన రాష్ట్రాలు యూపీ, ఒడిశా, మిజోరం, బీహార్ ఉన్నాయి. 27.4 శాతం ఉన్నత పాఠశాలల్లోనే సైన్స్ ల్యాబ్లు ఉన్నాయి. హైదరాబాద్ నగరం విషయానికొస్తే, ప్రతి లక్షమంది జనాభాకు 20 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్జిల్లాలో 8 రెట్లు అధికంగా160 బడులు ఉండటం విశేషం. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలే కాదు, ఏకరూప దుస్తులు సైతం అందని ద్రాక్షగానే మారింది. 2022–-23 విద్యా సంవత్సరం ప్రారంభమై ఏడు నెలలు గడిచినా 60 శాతం మించి పాఠ్యపుస్తకాలు సరఫరా కాలేదు. ప్రభుత్వ బడుల్లో వసతుల మెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం ‘విద్యాంజలి’, మన రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు మన బడి’ కార్యక్రమాలు అమలు చేస్తూ, దాతల నుంచి విరాళాలను ఆహ్వానిస్తున్నాయి. వాటితో కంప్యూటర్లు, ఇంటర్నెట్, విద్యుత్, డిజిటల్, స్మార్ట్ క్లాస్ రూమ్ తదితర సదుపాయాలు కల్పించాలి. ఈ సౌకర్యాల ఏర్పాటుతో చేతులు దులుపుకోకుండా, వాటిని సమర్థంగా వినియోగించుకోవడం, అవసరమైన వనరులు కల్పించడం, ఫలితాలు రాబట్టడంపై దృష్టి సారించాలి. అప్పుడే ఉత్తమ పాఠశాలల పోటీలో మన బడులు ముందు ఉంటాయి.
కనీస సౌలత్లు లేక..
విద్యారంభంలో కొత్త ఉత్సాహంతో బడికి వెళ్తున్న విద్యార్థులకు ఏటా సమస్య లు స్వాగతం పలుకుతున్నాయి. తలుపులు లేని తరగతి గదులు, కంపుకొడుతున్న మరుగుదొడ్లు, నీటి వసతి లేని టాయిలెట్ల, పెచ్చులూడుతున్న భవనాలు, నెర్రలిచ్చిన గోడల మధ్య విద్యాభ్యాసం కొనసాగుతున్నది. శిథిలావస్థకు చేరుకున్న సర్కారు బడులను మరమ్మతు చేయకుండానే తరగతులు నిర్వహిస్తున్నారు. టీచర్లు, స్టూడెంట్లు వర్షాకాలంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8,980 సర్కారు బడుల్లో మరుగుదొడ్లు లేవు. విద్యాహక్కు చట్టం ప్రకారం.. ప్రతి స్కూలులో బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఉండాలన్న నిబంధన ఉన్నా, ఎక్కడా అమలు కావడం లేదు. బాలికలకు టాయిలెట్స్ లేని రాష్ట్రాల్లో అసోం తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉన్నట్లు ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా చూస్తే 78,854 బడుల్లో బాలికలకు మరుగుదొడ్లు లేవు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021 బడ్జెట్ లోనే ప్రత్యేక పథకం కింద బడుల రూపురేఖలు మారుస్తామని ప్రకటించినా ఇప్పటివరకు మార్పు కనిపించడం లేదు. ‘మన ఊరు – మన బడి’ పథకం కింద 26, 072 బడుల్లో రూ.7,289 కోట్లతో సౌకర్యాలను మెరుగుపరచాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. శిథిలావస్థలో ఉన్న భవనాల స్థానంలో కొత్తవాటిని నిర్మించాలని నిర్ణయించింది. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 9,123 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసింది. వీటి పనులు నత్తనడకన సాగుతున్నాయి.
- కోడం పవన్ కుమార్,
సీనియర్ జర్నలిస్ట్