ఏడాదికి 50 కిలోల ఫుడ్ పడేస్తున్నం

ఏడాదికి 50 కిలోల ఫుడ్ పడేస్తున్నం

మన దేశంలో ఒక్కో వ్యక్తి ఇంట్లో వృథా చేస్తున్న ఆహారమిది


ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆహారం వృథా అవుతోందని యునైటెడ్ నేషన్స్ (యూఎన్) ఆందోళన వ్యక్తం చేసింది. 2019లో 931 మిలియన్ టన్నుల ఆహారం వృథా అయిందని వెల్లడించింది. ఇది ఆ ఏడాది అందుబాటులో ఉన్న మొత్తం ఆహారంలో 17 శాతమని తెలిపింది. ఫుడ్ వేస్టేజీ ఇండ్లలోనే ఎక్కువగా ఉంటోందని యూఎన్ చెప్పింది. గ్లోబల్ గా ఒక్కో వ్యక్తి ఏడాదికి121 కిలోల చొప్పున ఫుడ్ వేస్ట్ చేస్తున్నాడని.. ఇందులో ఇంట్లోనే 74 కిలోలు వృథా చేస్తున్నాడని పేర్కొంది. ఇక మన దేశంలో ఇళ్లల్లో ఒక్కో వ్యక్తి ఏడాదికి 50 కిలోల చొప్పున ఆహారాన్ని వృథా చేస్తున్నట్లు తెలిపింది. ఇటీవల విడుదల చేసిన ‘‘ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్టు 2021’’లో ఈ విషయాలను వెల్లడించింది.

ఇళ్లల్లోనే ఎక్కువ వేస్టేజీ…

యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్ మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్ఈపీ), బ్రిటన్ కు చెందిన చారిటీ సంస్థ వేస్ట్ అండ్ రీసోర్స్ యాక్షన్ ప్రోగ్రామ్ (డబ్ల్యూఏఆర్ పీ) కలిసి ఈ రిపోర్టు తయారు చేశాయి. ఇందుకోసం 54 దేశాల్లో ఫుడ్ వేస్టేజీపై స్టడీ చేశాయి. పేద, మధ్య తరగతి, ధనిక దేశాలనే తేడాల్లేకుండా అన్ని దేశాల్లోనూ పెద్ద ఎత్తున ఆహారాన్ని వృథా చేస్తున్నారని రిపోర్టులో వెల్లడైంది. వినియోగదారులకు అందుబాటులో ఉండే మొత్తం ఆహారంలో 11 శాతం ఇళ్లల్లో వృథా అవుతోందని తేలింది. ఫుడ్ సర్వీసెస్ ద్వారా 5 శాతం, రిటైల్ ఔట్ లెట్లలో 2 శాతం వేస్ట్ అవుతోందని రిపోర్టు పేర్కొంది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) రిపోర్టు ప్రకారం 2019లో 690 మిలియన్ల మంది ఆకలితో అలమటించారని యునైటెడ్ నేషన్స్ పేర్కొంది. కరోనా తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్ల మంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తలసరి ఆహారం వృథా దక్షిణాసియా, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలతో పోల్చితే.. పశ్చిమ ఆసియా, ఆఫ్రికా దేశాలలోనే ఎక్కువగా ఉందని పేర్కొంది.

కాలుష్యానికీ కారణమే..

వృథాగా పారేస్తున్న ఆహారంతో వాతావరణం కలుషితమవుతోందని యూఎన్ హెచ్చరించింది. వేస్ట్ గా పడేస్తున్న ఫుడ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 8 నుంచి 10 శాతం కార్బన్ ఉద్గారాలు పెరుగుతున్నాయని రిపోర్టులో వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ఫుడ్ వేస్టేజీని తగ్గించాల్సిన అవసరం ఉందని యూఎన్ఈపీ చీఫ్ ఇంగెర్ అండర్సన్ పేర్కొన్నారు. ‘‘ఫుడ్ వేస్టేజీని తగ్గిస్తే కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. మరోవైపు అందరికీ ఆహారం అంది, ఆకలి కేకలు ఉండవు” అని ఆయన చెప్పారు. ఇళ్లల్లో ఫుడ్ వేస్టేజీ ఒకప్పుడు ధనిక దేశాల్లోనే ఉండేదని, కానీ ఇప్పుడు అన్ని దేశాల్లోనూ ఈ సమస్య ఉందని డబ్ల్యూఏఆర్ పీ సీఈఓ మార్కస్ గోవర్ తెలిపారు.