- భద్రతా బలగాలపై చత్తీస్గఢ్ గిరిజనుల ఆరోపణ
భద్రాచలం, వెలుగు: భద్రతా బలగాలు తమపై డ్రోన్లతో బాంబు దాడులకు పాల్పడుతున్నాయని చత్తీస్గఢ్సూక్మా జిల్లాలోని ఆదివాసీ గ్రామాల ప్రజలు ఆరోపించారు. శనివారం బాంబుల శకలాలను మీడియాకు అందజేశారు. సుక్మా జిల్లా టేకులగూడెం-, జేగురుగొండ పరిధిలోని పువ్వర్తి, గుండం, భట్టిగూడ గ్రామాల్లో బాంబు శకలాలు దొరికాయి. ఈ మూడు గ్రామాలపై శుక్రవారం డ్రోన్లతో బాంబులతో దాడి చేసినట్లుగా గిరిజనులు ఆరోపిస్తున్నారు. మేమంతా అటవీ ఉత్పత్తుల కోసం ఫారెస్ట్ లోకి వెళ్లడం వల్ల ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్పారు.
పువ్వర్తి బేస్ క్యాంపు పరిధిలోని బలగాలే దాడులకు పాల్పడ్డారని చెప్తున్నారు. పువ్వర్తి దండకారణ్యం మావోయిస్టు పార్టీ మిలటరీ చీఫ్, కీలక నేత హిడ్మా స్వగ్రామం. ఆయన ఇటీవలే కేంద్ర కమిటీ మెంబర్గా ప్రమోషన్ తీసుకున్నారు. ఈయన స్థానంలో కొత్త మిలటరీ చీఫ్గా కూడా ఇదే గ్రామానికి చెందిన దేవా వ్యవహరిస్తున్నారు. అందుకే ఈ గ్రామంలో కేంద్రం సీఆర్పీఎఫ్ జవాన్లతో బేస్ క్యాంపును ఏర్పాటు చేసింది. ఈ విషయమై స్థానిక పోలీసులను వివరణ కోరగా..పువ్వర్తి, గుండం, భట్టిగూడ ప్రజలు చేస్తున్నవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేశారు. అసలు తమ బలగాలు ఎలాంటి డ్రోన్ దాడులు జరపలేదని పేర్కొన్నారు.