
బండ్లగూడ జాగర్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవని స్థానికులు వెల్లడిస్తున్నారు. సమస్యలు పట్టించుకుని పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు, ఇతరత్రా విషయాలపై కిస్మత్ పూర్ మాజీ ఉపసర్పంచ్ శేఖర్, విద్యార్థులు, స్థానికులు v6తో మాట్లాడారు. పేద, మధ్య తరగతి వర్గం వారు తమ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతారని తెలిపారు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలకు పంపుతుంటే నిరాశే ఎదురవుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువై విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నట్లు వివరించారు. బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ కిస్మత్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి వసతులు కల్పించకపోవడంతో విద్యార్థులు పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
మంచినీరు, టాయిలెట్స్, తరగతి గదులు.. ఇలా ఏ ఒక్క సదుపాయం సరిగ్గా లేదంటున్నారు. బాత్‌రూమ్‌లు కంపుకొడుతున్నట్లు, తరగతి గదుల్లో ఉన్న వారు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు రాలేదన్నారు. ఉపాధ్యాయుల కోరత సైతం ఉందని, తరగతి గదులు సైతం సరిపోక సగం మంది విద్యార్థులు ఆరు బయటే చదువుకుంటున్నారన్నారు. అక్కడే మధ్యాహ్న భోజనానికి సంబంధించిన సామాగ్రి కూడా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అంతేగాకుండా పలు తరగతి గదులు పెచ్చులు ఊడుతున్నాయన్నారు. ఇక్కడ నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరుతున్నారు.