సర్కార్ నిర్లక్ష్యమే ముంచింది
సమాచారం ఇవ్వకుండా అలసత్వం
సహాయ చర్యలు అంతంత మాత్రమే
హైదరాబాద్‌లో లక్షలాది మందిపై ఎఫెక్ట్
తిండి, నీళ్లు లేక జనం అవస్థలు
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శల వెల్లువ
ఎటు చూసినా వరద.. మోకాళ్ల లోతు బురద.. ఇప్పుడు హైదరాబాద్‌లో వందలాది కాలనీల్లో ఇదే దుస్థితి. మూడురోజులుగా వేలాది మందికి కంటి మీద కునుకు లేదు.. తిండి పెట్టే దిక్కు లేదు. వందేండ్లలో ఎన్నడూ లేనంత భారీ వానలు రాష్ట్ర రాజధానిని ముంచెత్తితే.. సర్కారు మాత్రం లైట్ తీసుకుంది. విపత్తుల టైంలో వెంటనే రెస్పాండ్ అవ్వాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ఉలుకూపలుకు లేకుండా వ్యవహరించింది. మొన్నటివరకు చిన్న వానలకే డ్రైనేజీలు పొంగి జనం ప్రాణాలు తీసినా సర్కారు మేలుకోలేదు. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు ఏకంగా 31 మందిని బలితీసుకుంది. వరదల్లో కొట్టుకపోయిన కొందరి ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు. వెంటనే స్పందించి వాళ్లను కాపాడాల్సిన ఆఫీసర్లు చేతులెత్తేశారు. కరోనా విషయంలో మాదిరిగానే వరదలపైనా సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్, వెలుగు: తుఫాన్లు వచ్చినప్పుడు, అకాల వర్షాలు కురిసినప్పుడు, అనుకోని విపత్తులు వచ్చినప్పుడు రాష్ట్రంలో దాని ఎఫెక్ట్ ఎంత..? ఆస్తి నష్టం.. ప్రాణ నష్టం ఎంత..? అనేది.. ఏ రోజుకారోజు ప్రకటించాల్సిన డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ పూర్తిగా ఫెయిలైంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి అవసరమైతే సైనిక బలగాలు, హెలికాప్టర్ల సేవలను వినియోగించాల్సిన ఆఫీసర్లు ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రజలకు తగిన సమాచారం ఇవ్వకపోవడమే కాదు.. వారిని అలర్ట్ కూడా చేయలేదు. కనీసం సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా.. మృతుల వివరాలు, మునిగిన కాలనీల వివరాలను ప్రకటించలేదు. ఈ వానాకాలంలో ఇప్పటివరకు వరుసగా మూడుసార్లు భారీ వర్షాలతో పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. ఆగస్టు, సెప్టెంబర్‌లో రెండు దఫాలుగా కురిసిన వర్షాలతో లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఈ వివరాలను కూడా ప్రభుత్వం వెల్లడించలేదు. పంట నష్టం అంచనా వేయకుండా పక్కనపెట్టింది.
ఒక్కరోజు లేటుగా..!
విపత్తులు వస్తే యుద్ధ ప్రాతిపదికన స్పందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ఆలస్యంగా తేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు జల ప్రళయం హైదరాబాద్ సహా పలు ప్రాంతాలను చుట్టుముట్టింది. ఉదయానికే నగరం నీట మునిగింది. అదేమీ పట్టనట్లుగా బుధవారం రోజంతా ప్రభుత్వం వ్యవహరించిన తీరు విమర్శలపాలైంది. నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం శాసన మండలి సమావేశాలు కొనసాగటం.. జీహెచ్ఎంసీ సహా పలు బిల్లులు ఆమోదం పొందడం, మరోవైపు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ పూలు, పండ్ల తోటలపై సీనియర్ ఆఫీసర్లతో రివ్యూ చేయటం… వరదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరును వేలెత్తి చూపింది. అసలు సిటీలో ఏమీ జరగలేదన్నట్లుగా ఒక రోజంతా సర్కారు తేలిగ్గా తీసుకుంది. మరుసటి రోజున గురువారం సీఎం వరదలపై రివ్యూ చేయటం.. వరదలతో రూ. 5 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, రూ. 1,350 కోట్లు విడుదల చేయాలని కేంద్రం సాయం కోరుతూ ప్రధానికి లేఖ రాశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం లేటు స్పందనపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయం కావటంతో మండలిలో ప్రకటన చేయాల్సిన సీఎం క్యాంప్ ఆఫీసులో ఉండటం, కనీసం రాష్ట్ర రాజధానిలో నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటించకపోవటం రాజకీయ
దుమారం లేపింది.
రెండ్రోజుల్లో 1,844 ఫిర్యాదులు
గ్రేటర్ సిటీలో వరదలతో అపార నష్టం సంభవించింది. రోడ్లు, నాలాలన్నీ కొట్టుకుపోవటం, బస్తీలన్నీ జలమయం కావటంతో జనం బేజారయ్యారు. ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో జీహెచ్ఎంసీ కాల్ సెంటర్‌కు, డయల్ 100, మై జీహెచ్ఎంసీ యాప్‌కు వరుసగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రెండు రోజుల్లోనే 1,877 ఫిర్యాదులు నమోదయ్యాయి. 708 కాలనీలు, బస్తీలన్నీ నీట మునిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి.
జనం శాపనార్థాలు
హైదరాబాద్‌లో దాదాపు వెయ్యి కాలనీలు, బస్తీలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 20 లక్షల మంది వరదలతో ఎఫెక్ట్ అయ్యారు. నాలాలు, లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు, చెర్వుల్లో వేలాది వాహనాలు కొట్టుకు పోయాయి. హైదరాబాద్‌లో వందలాది కాలనీలు మూడురోజులుగా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. చాలా కాలనీల్లో నడుం లోతు నీరు నిల్వ చేరటంతో ఇండ్ల నుంచి బయటకు రాలేక సిటీ జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. మూసీ పరీవాహకంలో ఉన్న కాలనీలన్నీ ఇప్పటికీ వరద ఉధృతికి తల్లడిల్లుతున్నాయి. ఈ టైమ్‌లో తమ గోడు పట్టించుకోకుండా ప్రభుత్వం ఇతరత్రా అంశాలకు పెద్దపీట వేయటం పట్ల సిటీ వాసుల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది. గురువారం గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలను చూసేందుకు వెళ్లిన మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు ఈ నిరసన సెగ తగిలింది. నీటిలో మునిగిన కాలనీల్లోని జనం శాపనార్థాలు పెట్టారు.
నిద్రలేకుండా బతుకుతున్నం
పల్లె చెరువు కట్ట తెగిపోవడంతో ఆ నీరు కాలనీలోంచి వెళ్తున్నది. చెరువు చుట్టుపక్కల ఉన్న ఆక్రమణల వల్ల మేము ఇబ్బందులు పడుతున్నం . ఎక్కడపడితే అక్కడ ఫ్యాక్టరీలు, ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నయ్. వీటికి అనుమతులు ఎవరు ఇస్తున్నారో ఏమో అర్థం కావడంలేదు. ఎవరో చేసిన తప్పులకు మేం బలి అవుతున్నం . మూడ్రోజులుగా నిద్రలేకుండా భయంతో బతుకుతున్నం.
– ఎండీ ఇజాజ్, అలీనగర్ వాసి, హైదరాబాద్
For More News..