నేటి సమాజంలో మానవ సంబంధాలన్నీ మనీ బంధాలుగా మారిపోయాయి.రక్త సంబంధీకులైనా రూపాయి కోసం కొట్టుకు చస్తున్నారు. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఇండోర్ జిల్లాలో పాకెట్ మనీగా రూ. 2,000 ఇవ్వడానికి నిరాకరించినందుకు 25 ఏళ్ల వ్యక్తి తన తండ్రిని కొట్టి చంపాడని పోలీసులు సోమవారం (జూన్19) తెలిపారు. బాబు చౌదరి (50) అనే రైతు జూన్ 15 రాత్రి దేపాల్‌పూర్ ప్రాంతంలోని పొలంలో విగతజీవిగా కనిపించాడని పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) హితికా వాసల్ తెలిపారు.
నేరం జరిగిన ప్రదేశం నుండి సేకరించిన విచారణ, సాక్ష్యాధారాల ఆధారంగా పోలీసులు బాధితుడి కుమారుడు సోహన్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడని, తన తండ్రికి...పొలంలో సహాయం చేసేవాడని అధికారి తెలిపారు. జూన్ 15 రాత్రి సోహన్ తన తండ్రిని పాకెట్ మనీగా రూ. 2,000 అడిగాడు. కాని అతను ఇవ్వనని ఖచ్చితంగా నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన సోహన్ పొలంలో ఉన్న రాయిని తీసుకుని బాధితుడిపై దాడి చేసి తలను చితకబాదాడని ఎస్పీ వాసల్ తెలిపారు. కేసుపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు వారు వివరించారు.