లక్షన్నర విలువైన అనుమతిలేని మందులు సీజ్.. మెడికల్ షాపులపై కేసు

హైదరాబాద్ సిటీ, వెలుగు: మెడికల్  షాపుల్లో విక్రయిస్తున్న రూ.లక్షన్నర విలువైన అనుమతి లేని మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాష్ట్రంలోని పలు మెడికల్  షాపుల్లో డ్రగ్  కంట్రోల్  అధికారులు తనిఖీలు నిర్వహించారు. సంగారెడ్డి, ఆదిలాబాద్  జిల్లాల్లోని పలు మెడికల్  షాపుల్లో అక్రమంగా నిల్వచేసిన మందులను సీజ్  చేశారు. పటాన్ చెరులోని జేపీ కాలనీలో ఓ మెడికల్ షాపులో లైసెన్స్ లేకుండా మందులు నిల్వ ఉంచారని అధికారులు తెలిపారు.

54 రకాల మెడిసిన్స్, యాంటీ బయోటిక్, స్టెరాయిడ్స్, యాంటీ డయాబెటిక్, యాంటీ హైపెరిటెన్సివ్  మెడిసిన్స్ ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఆదిలాబాద్  జిల్లాలోని ఇచ్చోడలో అధిక రక్తపోటుకు చికిత్స అంటూ విక్రయిస్తున్న ఆయుర్వేదిక్  మందులను కూడా అధికారులు సీజ్  చేశారు. లైసెన్స్ లేని మెడికల్  షాపుల నిర్వాహకులపై కేసు నమోదు చేశామని  అధికారులు తెలిపారు.