బషీర్ బాగ్,వెలుగు: నగరంలోని మెహదీపట్నం, అత్తాపూర్ మొగల్ కా నాలా ప్రాంతంలో రూ. 46 లక్షల విలువ చేసే హాష్ ఆయిల్, గంజాయిని తరలిస్తున్న నిందితులను పట్టుకున్నట్లు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషీ తెలిపారు. నాంపల్లి లోని ఎక్సైజ్ భవన్ లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఏపీ కడపకు చెందిన సాధిక్ వలీ, రంపచోడవరానికి చెందిన హరికుమార్, సత్యనారాయణ అనే ముగ్గురు హైదరాబాద్ కు 4.2 కిలోల హాష్ ఆయిల్ ను సరఫరా చేస్తుండగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ ఎన్ అంజిరెడ్డి బృందం మొగల్ కా నాలా వద్ద వారిని పట్టుకున్నారు.
నిందితులను విచారించగా.. ఏపీ రాష్ట్రంలోని రాజమహేంద్రవరంలో మరింత గంజాయి ఉన్నట్లు సమాచారం అందించారు. దీంతో ప్రత్యేకంగా ఒక బృందాన్ని అక్కడికి పంపించి 70.15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హాష్ ఆయిల్, గంజాయి విలువ రూ.46 లక్షల మేర ఉంటుందని అంచనా వేశారు. ఆపరేషన్ దూల్ పేట్ లో కూడా 95 శాతం మేర గంజాయి అమ్మకాలు నిలిపివేశామని, 62 మందిని రిమాండ్ కు పంపించామని తెలిపారు. సమావేశంలో జాయింట్ కమిషనర్ ఖురేషితో పాటు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్. అంజిరెడ్డి, సీఐలు మధుబాబు, గోపాల్ ఉన్నారు.