రోజురోజుకి దిగజారుతున్న పరిస్థితులు.. పాక్ ఆస్పత్రుల్లో మందుల కొరత

పాకిస్తాన్‭లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకి మరింత దిగజారుతోంది. వైద్య వ్యవస్థను ఆర్థిక సంక్షోభం మరింత దెబ్బతీసింది. మందులు దొరక్క రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో ఫారెక్స్ నిల్వలు లేకపోవడం, ఇతర దేశాల నుంచి మందులను దిగుమతి చేసుకునే సామర్థ్యం తగ్గిపోయింది. దీంతో ఆస్పత్రుల్లో రోగులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. రోగులకు శస్త్రచికిత్స చేసేందుకు మందులు, వైద్య పరికరాల కొరత ఏర్పడింది. ఆపరేషన్ థియేటర్లలో శస్త్రచికిత్సలకు అవసరమైన మత్తు మందు కూడా రెండు వారాలకు మాత్రమే సరిపడా ఉందని వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితి కారణంగా ఆస్పత్రుల్లో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. ఇక వాణిజ్య బ్యాంకులు తమ దిగుమతుల కోసం ఎల్ సిలను జారీ చేయడం లేదని ఔషధ తయారీదారులు చెబుతున్నారు. 

భారత్ నుంచి చైనాతో సహా ఇతరదేశాల నుండి.. 95 శాతం మందుల తయారీకి అవసరమయ్యే ముడి పదార్థాలు పాకిస్తాన్ కు దిగుమతి అవుతూ ఉంటాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో డాలర్ల కొరత కారణంగా.. చాలా వరకు దిగుమతి చేసుకున్న  ముడి పదార్థాలు కరాచీ నౌకాశ్రయంలోనే నిలిచిపోయాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, రవాణా ఛార్జీల కారణంగా ఔషధాల తయారీ ఖర్చు నిరంతరం పెరుగుతోందని ఔషధ తయారీ పరిశ్రమ పేర్కొంది. పరిస్థితి చేయదాటిపోక ముందే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్ మెడికల్ అసోసియేషన్ కోరింది. 
అయినప్పటికీ అధికారులు తక్షణ చర్యలు చేపట్టలేదని అందుకే పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.