హైదరాబాద్, వెలుగు: గోవా నుంచి డ్రగ్స్ సప్లై చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను టీఎస్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీ–న్యాబ్) బుధవారం అరెస్ట్ చేసింది. సైబరాబాద్ పరిధిలోని చందానగర్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి.. గోవాకు చెందిన డ్రగ్స్ సప్లయర్‌తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసింది. వీరి వద్ద నుంచి18 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ, బైక్ స్వాధీనం చేసుకుంది. టీ–న్యాబ్ ఎస్‌పీ గుమ్మి చక్రవర్తి వెల్లడించిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన ఎమ్‌జీ అఖిల్(24) గియా గెస్ట్‌హౌజ్‌లో నివసిస్తూ, స్థానికంగా హాస్టల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గోవాకు వచ్చే టూరిస్టులకు ఎమ్‌డీఎమ్‌ఏ సహా అవసరమైన డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు. గోవా టూర్ వెళ్లిన ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన సూర్య కిషన్(21), రాజమండ్రికి చెందిన రొహన్ పాల్(19) అక్కడ అఖిల్‌కు పరిచయం అయ్యారు. అఖిల్ వద్ద ఇద్దరు రెగ్యులర్‌గా డ్రగ్స్ కొనుగోలు చేసి, హైదరాబాద్, రాజమండ్రిలోని కస్టమర్లకు సప్లయ్ చేస్తుండేవారు. సూర్య కిషన్ నుంచి హబ్సిగూడకు చెందిన తోట సురేందర్(23), బేలె అరుణ్ కుమార్(23)లు కూడా డ్రగ్స్ కొనుగోలు చేసి కస్టమర్లకు అమ్ముతున్నారని దర్యాప్తులో తేలింది.
ఇలా దొరికారు
హైదరాబాద్, సైబరాబాద్‌లోని రెగ్యులర్ కస్టమర్ల కు నిందితులు ఎమ్‌డీఎమ్‌ఏ డ్రగ్ సప్లయ్ చేస్తు న్నారు. డ్రగ్ డీలింగ్ కోసమే అఖిల్ మంగళవారం గోవా నుంచి వచ్చాడు. చందానగర్‌లో సూర్య కిషన్, రొహన్ పాల్‌కు ఎమ్‌డీఎమ్‌ఏ అందించేం దుకు యత్నించాడు. అప్పటికే గోవా సప్లయర్ అఖిల్ నెట్‌వర్క్‌పై నిఘా పెట్టిన టీ–న్యాబ్ పోలీసులు చందానగర్ పోలీసులతో కలసి ఆపరేషన్ చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి అఖిల్‌తో పాటు సూర్య కిషన్, రొహన్ పాల్, సురేందర్, అరుణ్ కుమార్‌లను అరెస్ట్ చేశారు. వీరి వద్ద డ్రగ్స్ కొన్న కస్టమర్ల వివరాలు కూడా సేకరిస్తున్నారు. విచారణ కోసం నిందితులను చందానగర్ పోలీసులకు అప్పగించారు.