- ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- పరారీలో మరో నిందితుడు
ఎల్బీనగర్, వెలుగు : మధ్యప్రదేశ్ నుంచి సిటీకి డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న ఇద్దరిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.25 లక్షల విలువైన పప్పీ స్ట్రా, ఓపీయం డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన చెన్నా రామ్(20) మూడేండ్ల కిందట సిటీకి వచ్చి హాఫీజ్‌పేటలో ఉంటూ కార్పెంటర్‌గా పని చేసేవాడు. కాగా, ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఈజీ మనీ కోసం స్కెచ్ వేశాడు. మధ్యప్రదేశ్ కు చెందిన పూర్ సింగ్ అనే డ్రగ్ సప్లయర్ వద్ద రూ.50 వేలకు కిలో లెక్కన పప్పీస్ట్రా, ఒపీయం కొనుగోలు చేసి తన ఇంట్లోనే పౌడర్‌గా చేసి సిటీలోని డ్రగ్స్ బాధితులకు అమ్ముతున్నాడు.
తనకు దగ్గర పరిచయస్తుడైన రానా రామ్ ద్వారా కస్టమర్లను గుర్తించి వారికి కిలోకు రూ.4 లక్షల చొప్పున అమ్ముతున్నాడు. బుధవారం రాత్రితో ప్రయాణిస్తున్న చిన్నారాంను ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకొని డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అతని విచారించగా తాను మధ్యప్రదేశ్ నుండి పూర్ సింగ్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చి అమ్మినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడికి సహకరించిన రానా రామ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తన బైక్‌పై తిరుగుతూ డ్రగ్స్ బాధితులకు అమ్ముతున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో మరింత సమాచారం కోసం వనస్థలిపురం పోలీసులుదర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి నుంచి డ్రగ్స్ తో పాటు బైక్, వెయిట్ మెషీన్, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.