జోరుగా మత్తు పదార్థాల రవాణా

జోరుగా మత్తు పదార్థాల రవాణా
  •      అరెస్ట్​లు చేసినా ఆగడం లేదు
  •      యాదాద్రి మీదుగా హాష్​ ఆయిల్, గంజాయి తరలింపు 
  •      లీటర్​హాష్​ ఆయిల్ రూ.10 లక్షల నుంచి రూ.13 లక్షలు

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా మీదుగా మత్తు పదార్థాల రవాణా జోరుగా సాగుతోంది. గతంలో గంజాయి ఒక్కటే రవాణా చేస్తుండగా కొంతకాలంగా హాష్​ ఆయిల్, చరాస్​ పేస్ట్​ కూడా తరలిస్తున్నారు. పోలీసులు అరెస్టులు చేస్తున్నా రవాణా మాత్రం ఆగడం లేదు. ఒడిశాలోని మల్కన్ గిరి, ఏపీలోని విశాఖపట్నంతోపాటు తెలంగాణ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గంజాయి సాగు అవుతోంది. 

అక్కడి నుంచి విజయవాడ, వరంగల్​హైవేల మీదుగా యథేచ్చగా హైదరాబాద్, మహారాష్ట్రకు రవాణా చేస్తున్నారు. అయితే గంజాయితోపాటు దాని నుంచి తీసిన హాష్​ ఆయిల్, చరాస్ పేస్ట్​ రవాణా చేస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రా – -ఒడిశా సరిహద్దు (ఏవోబీ) నుంచి ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రకు గంజాయి, హాష్ ఆయిల్​రవాణా జరుగుతోందని పోలీసులు వెల్లడించారు. విజయవాడ, వరంగల్​హైవేల మీదుగా తరలిస్తున్న గంజాయి, హాష్​ ఆయిల్​ను ఎస్వోటీ పోలీసులు పలుమార్లు పట్టుకున్నారు. ఎంతమందిని అరెస్ట్​ చేస్తున్నా.. రవాణా మాత్రం ఆగడం లేదు. 

పలువురి అరెస్ట్​లు..

యాదాద్రి జిల్లాలో పలుమార్లు గంజాయి, హాష్​ఆయిల్​ను పోలీసులు స్వాధీనం చేసుకొని పలువురిని అరెస్ట్​ చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్​లోని నర్సీపట్నం నుంచి హైదరాబాద్​కు తరలిస్తున్న రూ.20 లక్షల విలువైన హాష్​ ఆయిల్ ను స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్​ చేశారు. గతేడాదిలో రామన్నపేట, ఆలేరు, చౌటుప్పల్​లో రెండు, మూడు లీటర్ల చొప్పున హాష్ ఆయిల్​ను గతేడాది పట్టుకున్నారు. అదేవిధంగా జిల్లాలోని యాదగరిగుట్టలో చరాస్ పేస్ట్​ తీసుకొచ్చిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక గంజాయి రవాణా చేస్తున్న వారిని అనేక సార్లు పట్టుకున్నారు. 

మత్తు కోసం.. బిజినెస్​లోకి..

విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి, హాష్​ ఆయిల్​ విక్రయాలు సాగుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి కాలేజీల్లో చదువుకుంటున్న స్టూడెంట్స్​ లేదా యువతను ఎంచుకొని గంజాయి, హాష్​ ఆయిల్​ను విక్రయిస్తున్నారు. వీటికి బానిసలుగా మారిన స్టూడెంట్స్, యువత​చదువును పక్కన పెట్టి మత్తు కోసం ఆరాట పడుతున్నారు. ఇటీవల భువనగిరిలో పట్టుబడిన పెరుసాముల దినేశ్, అమర్థలూరి హానెస్ట్, తాళ్లపల్లి భరణి కూడా తొలుత మత్తుకు అలవాటుపడి.. ఇప్పుడు బిజినెస్​లోకి అడుగుపెట్టారని పోలీసులు గుర్తించారు. 

గంజాయి నుంచి మూడు రకాల హాష్​ ఆయిల్.. ​

లాభాలు ఎక్కువగా వస్తుందన్న స్మగ్లర్లు హాష్​ ఆయిల్​రవాణాను ఎంచుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. గంజాయి కంటే.. హాష్​ ఆయిల్, చరాస్​పేస్ట్​​అమ్మకాల్లోనే లాభాలు ఎక్కువగా ఉంటున్నాయి. రూ.లక్షకు పైగా వెచ్చించి కొనుగోలు చేసిన 50 కిలోల గంజాయి నుంచి లీటర్​ హాష్​ ఆయిల్​ను తీస్తారని, అది మూడు రకాలుగా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. గంజాయి నుంచి తీసే హాష్​ఆయిల్​లో క్వాలిటీ పరంగా గోల్డ్​రకానికి లీటర్​కు రూ.13 లక్షలకు పైనే ఉంటే.. గ్రీన్​ రకానికి రూ.11 లక్షలకు పైగా, బ్లాక్​హాష్​ ఆయిల్​కు రూ.10 లక్షలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ధర ఎక్కువగా ఉండడంతో మిల్లీ మీటర్లలో విక్రయిస్తారని అంటున్నారు. 

5 ఎంఎల్​హాష్​ ఆయిల్​ను రూ.7 వేలకు పైగా విక్రయిస్తున్నారు. జిందా తిలిస్మాత్​మాదిరిగా కన్పించే ఈ ఆయిల్.. ​మూడు చుక్కలను సిగరెట్​లో వేసి పీలిస్తే మత్తులో మునిగిపోతారు. అదేవిధంగా గంజాయి మొక్కల నుంచి గమ్​తో చరాస్​ పేస్ట్​తయారు చేస్తున్నారు. ఈ పేస్ట్​50 గ్రాములకు రూ.20 వేలకు పైనే ఉంటుందని తెలుస్తోంది. సిగరెట్​లోని పొగాకు కొంత తొలగించి చరాస్​పేస్ట్​ను కలుపుకొని పీలుస్తు మత్తులో మునిగిపోతున్నారు.  

కొత్త పద్దతుల్లో రవాణా.. 

గంజాయి, హాష్​ ఆయిల్​రవాణాలో స్మగ్లర్లు కొత్త పద్దతులు కనిపెడుతున్నారు. గంజాయి ప్యాకెట్లను కారు డిక్కీల్లో, సీట్ల కింద దాచిపెట్టి రవాణా చేస్తున్నారు. గతేడాది కొబ్బరి బోండాల లోడుతో వెళ్తున్న డీసీఎంలో ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. మరో ఘటనలో ఏకంగా డీసీఎం అడుగు భాగంలో బాక్స్​ఏర్పాటు చేసి రవాణా చేశారు. హాష్​ఆయిల్​ను మాత్రం ప్లాస్టిక్​ కవర్లలో  రవాణా చేస్తున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.