శంషాబాద్, వెలుగు: డ్రగ్స్ఇప్పుడు దేశానికి, రాష్ట్రానికి పెద్ద సమస్యగా మారిందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. మంగళవారం శంషాబాద్ ముచ్చింతల్ లోని స్వర్ణ భారత్ ట్రస్ట్ లో స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. దేశాన్ని అచేతనం చేయాలన్న లక్ష్యంతో పాకిస్తాన్ సరిహద్దుల గుండా దేశంలోకి డ్రగ్స్ పంపిస్తోందన్నారు. పాకిస్తాన్ దుశ్చర్యతో పంజాబ్ తీవ్ర ప్రభావానికి గురైందని, క్రమంగా ఇతర రాష్ట్రాలకు ఈ భూతం వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాలు, గ్రామాల్లో కూడా డ్రగ్స్ వాడకం పెరుగుతోందని, వాటి కట్టడికి ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు.
యువత ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని, కష్టపడి విజయం సాధించాలన్నారు. స్నేహితులతో కలిసి సమాజానికి ఏదన్నా చేయాలనే ఉద్దేశంతో స్వర్ణభారత్ ట్రస్ట్ ఏర్పాటు చేశామన్నారు. ఏటా వేల మంది నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నామన్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన తాను, కష్టపడటం ద్వారానే ఉన్నత స్థానానికి చేరుకోగలిగానని చెప్పారు. సినిమాలకు బానిస కావద్దని సూచించారు. ట్రస్ట్ కార్యక్రమాలను చక్కగా నిర్వహిస్తున్నారని మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ ను అభినందించారు.