- డ్రగ్ ఇంజక్షన్స్ వినియోగంలో హైదరాబాద్ ఐదో స్థానం: సందీప్ శాండిల్యా
- పబ్బుల్లో డ్రగ్ పిల్స్, కూల్ డ్రింక్స్‌లో కెటామిన్ మిక్స్ వినియోగం
- ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో అవగాహన కార్యక్రమంలో టీజీ న్యాబ్ డైరెక్టర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయని తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీజీన్యాబ్) డైరెక్టర్ సందీప్ శాండిల్యా హెచ్చరించారు. మాదకద్రవ్యాల బానిసల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ ఇంజెక్షన్స్ వినియోగించడంలో హైదరాబాద్ దేశంలోనే 5వ స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా టీజీ న్యాబ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో మంగళ, బుధ, గురు వారాల్లో ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేశారు.
బుధవారం జరిగిన ట్రైనింగ్ సెషన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 15వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. యువత జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న మత్తుపై సామాజిక పోరు అవసరమని పేర్కొన్నారు. ‘‘సింథటిక్ డ్రగ్స్, గంజాయిని అరికట్టడం ఒక్క పోలీసులతోనే కాదు.. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా వ్యవహరించాలి. ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ కోసం పబ్‌కి వెళ్లింది.
అక్కడ ఎక్స్‌టసీ పిల్స్ ఇచ్చారు. తనకు తెలియకుండానే ఆ యువతి డ్రగ్స్‌కి బానిస అయింది. తల్లి నగలు, తండ్రి వద్ద డబ్బులు దొంగిలించేది. కొన్ని పార్టీల్లో కూల్ డ్రింక్‌లో ‘కెటామిన్’డ్రగ్ కలుపుతున్నారు. మత్తులోకి వెళ్లిన యువతులపై అత్యాచారం చేస్తున్నారు. డ్రగ్స్ మహమ్మారి యువతుల మాన ప్రాణాలను తీస్తున్నది. చెన్నై, గోవా తరహాలో హైదరాబాద్‌లో కూడా మాదకద్రవ్యాల వినియోగం పెరిగిపోతున్నది”అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
2 లక్షల మందితో ‘యాంటీ డ్రగ్ సోల్జర్స్’
రాబోయే ఆరు నెలల్లో 2 లక్షల మందితో యాంటీ డ్రగ్ సోల్జర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సందీప్ శాండిల్యా తెలిపారు. ఇందుకోసం 1.30 లక్షల మంది ఎన్ఎస్ఎస్, 70 వేల మంది ఎన్‌సీసీ సభ్యులకు ట్రైనింగ్ ఇస్తామని వెల్లడించారు. ఇప్పటికే టీ న్యాబ్ ఆధ్వర్యంలో 148, లా అండ్ ఆర్డర్ పోలీసులు 590 అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, 1,25,249 మంది విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు.
ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 20,989 హైస్కూల్స్‌లో ప్రహరీ క్లబ్‌లు, 4,729 కాలేజీలు, 6,249 యూనివర్సిటీల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులు, యువత, టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, గ్రామస్తులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ తీసుకోవడం వల్ల తలెత్తే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. వీరి ద్వారా డ్రగ్స్ మహమ్మారిని నివారించేందుకు గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.