సంగారెడ్డి టౌన్, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని సంగారెడ్డి జిల్లా మన్నూరు పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రూపేశ్ గురువారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... కర్నాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా బాల్కి ప్రాంతంలోని బసవేశ్వర చౌక్‌కు చెందిన మల్లగొండ చోరీ కేసులో బీదర్ జైలులో ఉన్న టైంలో ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరికి చెందిన రాహుల్ చక్రవర్తి పరిచయం అయ్యాడు. తాను గంజాయి కేసులో జైలులో ఉన్నానని, ఎండు గంజాయిని సరఫరా చేస్తే ఎక్కువ మొత్తం డబ్బు సంపాదించవచ్చని రాహుల్ మల్లగొండకు చెప్పాడు.
దీంతో జైలు నుంచి విడుదల అయ్యాక మల్లగొండ బాల్కి ప్రాంతానికే చెందిన, గంజాయి సరఫరా చేస్తున్న మల్లేశ్‌ను కలిశాడు. అతడి సూచనతో చత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాల్లో ఎండు గంజాయి కొని రవాణా చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం మన్నూర్ ఎస్సై, తన సిబ్బందితో కలిసి డాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా అటు వైపు వచ్చిన స్విఫ్ట్ డిజైర్ కారును ఆపి తనిఖీ చేయగా ఎండు గంజాయి కనిపించింది. నిందితుడు మల్లగొండను అదుపులోకి తీసుకొని 40 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎస్పీ తెలిపారు. నిందితుడికి సహకరించిన మల్లేస్ జాదవ్, దాదా పాటిల్, రాహుల్ చక్రవర్తి పరారీలో ఉన్నారని ఎస్పీ చెప్పారు.
అమీన్‌పూర్‌లో 50 గ్రాముల హాష్‌ఆయిల్
హాష్ ఆయిల్ అమ్ముతున్న ముగ్గురిని అమీన్‌పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మెదక్ జిల్లా శంకరంపేట మండలానికి చెందిన కోయిలకండ్ల అఖిలేశ్, ఏపీలోని నెల్లూరు జిల్లా గూడూరు మండలానికి చెందిన ప్రేమ్, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలానికి చెందిన సాయి శివ చదువుకునే రోజుల్లోనే హాష్‌ఆయిల్‌కు అలవాటుపడ్డారు. వీరు ఉద్యోగ కోసం హైదరాబాద్ వచ్చి అమీన్‌పూర్ పరిసరాల్లో ఉంటున్నారు. సంగారెడ్డికి చెందిన బిలాల్, లింగంపల్లికి చెందిన శంకర్ వద్ద హాష్‌ఆయిల్ కొని తాగేవారు.
తాము కూడా హాష్ ఆయిల్ అమ్మి డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో, ఏపీలోని అరకు ప్రాంతానికి చెందిన సుబ్బారావు వద్ద ఆయిల్ దొరుకుతుందని తెలుసుకొని అక్కడికి వెళ్లి 50 గ్రాముల హాష్ ఆయిల్‌ను కొన్నారు. దానిని చిన్న చిన్న డబ్బాల్లో నింపి గురువారం బీరంగూడ కమాన్ వద్ద అమ్మేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారికి సహకరించిన సుబ్బారావు, శంకర్, జాయ్, బిలాల్ పరారీలో ఉన్నారని ఎస్పీ చెప్పారు. సమావేశంలో పటాన్‌చెరువు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, ఇన్స్‌పెక్టర్లు రమేశ్, విజయకృష్ణ, నాగరాజు, శ్రీనివాసరెడ్డి, ఎస్సైలు శ్రీకాంత్, రాజశేఖర్ ఉన్నారు.