- 70 గ్రాముల హెరాయిన్ స్వాధీనం
హైదరాబాద్, వెలుగు: రాజస్థాన్ నుంచి సిటీకి హెరాయిన్ సప్లయ్ చేస్తున్న ఇద్దరు సభ్యుల గ్యాంగ్‌ను ఎల్ బీనగర్ ఎస్ వోటీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి 70 గ్రాముల హెరాయిన్, వెయింగ్ మెషీన్, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుఉన్నారు. గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా తిలక్‌నగర్‌కు చెందిన పంకజ్ భాయ్(27), ప్రజాపతి ముఖేశ్లక్ష్మణ్ భాయ్ సిటీకి వచ్చి అంబర్ పేటలో ఉంటున్నారు. డ్రగ్స్ కు బానిసైన వీరిద్దరు సప్లయర్లుగా మారారు.
సిటీలోని తమ బంధువులు, ఫ్రెండ్స్‌కు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నారు. రాజస్థాన్ నుంచి హెరాయిన్ కొని హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఇందులో భాగంగా 70 గ్రాముల హెరాయిన్‌కు అమ్మేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు శుక్రవారం నాగోల్ క్రాస్ రోడ్లో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు కోసం నిందితులను నాగోల్ పోలీసులకు అప్పగించారు.