- సరిహద్దుల మీదుగా రాజస్థాన్‌కు
- అక్కడి నుంచి ప్రెవేట్ బస్సుల్లో హైదరాబాద్‌కు స్మగ్లింగ్
- నలుగురు నిందితుల అరెస్టు
హైదరాబాద్, వెలుగు: అఫ్గానిస్తాన్ నుంచి హెరాయిన్ సప్లయ్ చేస్తున్న ముఠా గుట్టురట్టైంది. అఫ్గాన్ నుంచి రాజస్థాన్ కు, అక్కడి నుంచి హైదరాబాద్ కు స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.7 కోట్ల విలువైన హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి శనివారం మీడియాకు వెల్లడించారు.
రాజస్థాన్‌లోని నాగోర్ జిల్లాకు చెందిన సంతోష్ ఆచారి, నేమిచంద్ భాటి, నర్పత్ సింగ్.. దేశవ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నారు. హెరాయిన్, ఎండీఎంఏ, కొకైన్ విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో హెరాయిన్ ముఠాలతో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. గతంలో మాదకద్రవ్యాల కేసులో సంతోష్ అరెస్ట్ అయ్యాడు. ఆ సమయంలో జోధ్‌పూర్ జైలులో అతనికి నేమి చంద్ పరిచయం అయ్యాడు. హెరాయిన్ సప్లయ్ చేసేందుకు ఇద్దరూ ప్లాన్ చేశారు.
రెండున్నర నెలల క్రితం హైదరాబాద్‌లోని నేమిచంద్ సోదరుడు అజయ్‌భాటి అలియాస్ లాలుకు హెరాయిన్, ఎండీఎంఏ దందా గురించి సంతోష్ చెప్పాడు. హైదరాబాద్‌లో డిమాండ్ ఎక్కువగా ఉన్నందును పెద్ద మొత్తంలో సంపాదించవచ్చని సూచించాడు. దీంతో చౌటుప్పల్‌లోని మల్కాపూర్‌లో నివాసం ఉంటున్న, రాజస్థాన్‌కు
చెందిన హరీష్ సిర్వికి అజయ్ గురించి చెప్పాడు.
జాయింట్ ఆపరేషన్‌తో..
సంతోష్, నేమిచంద్, నర్పత్, అజయ్ కలిసి హైదరాబాద్, బెంగళూరుకు హెరాయిన్, ఎండీఎంఏ సప్లయ్ చేయాలని ప్లాన్ చేశారు. మాదాపూర్‌లోని డ్రగ్ పెడ్లర్లు, కస్టమర్లకు రూ.7 వేలకు గ్రాము చొప్పున అమ్మేందుకు బేరం కుదుర్చుకున్నారు. ఇంటర్నేషనల్ డ్రగ్స్ స్మగ్లర్లు అఫ్గాన్ నుంచి విమానాల్లో సప్లయ్ చేస్తున్న హెరాయిన్ లింక్ తెలుసుకున్నారు. రాజస్థాన్‌లోని స్థానిక డ్రగ్స్ పెడ్లర్ల వద్ద నేమి చంద్, నర్పత్ సింగ్ కిలో హెరాయిన్ కొనుగోలు చేశారు.
250 గ్రాముల చొప్పున 4 ప్యాకెట్లు తయారు చేశారు. బస్సులో రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు తెచ్చారు. శిల్పారామం సమీపంలో డ్రగ్స్‌ను విక్రయించేందుకు కస్టమర్ల కోసం ఎదురుచూస్తున్నారు. అప్పటికే యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారుల ద్వారా సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్‌ఓటీ, మాదాపూర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి నలుగురిని పట్టుకున్నారు. వీరి వద్ద ఉన్న కిలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ నంబర్ల ఆధారంగా హైదరాబాద్‌లోని
డ్రగ్ పెడ్లర్ల వివరాలను సేకరిస్తున్నారు.