హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. న్యూ ఇయర్ వేడుకలే టార్గెట్ గా చేసుకుని.. ఓ ముఠా నగరానికి మత్తు పదార్థాలు గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తోంది. విజయవాడలో పట్టుబడ్డ ప్రధాన నిందితుడు హరి సతీష్ ఇచ్చిన సమాచారంతో నగరంలో సోదాలు చేశారు. బంజారాహిల్స్ లోని ఓ హాస్టల్ పై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ మెరుపు దాడులు చేసింది. 48 గ్రాముల MDMA, 25గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలించినట్టు అధికారులు గుర్తించారు.
ఒక్క గ్రామ్ రూ.10 వేలు చొప్పున రేటు కట్టి ఈ ముఠా విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ నిందితుడు యమనే నుంచి కీలక సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులు రాబట్టారు. ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేస్తున్నారు ? ఎక్కడి నుంచి డ్రగ్స్ తెస్తున్నారు ? దీని వెనుక ఎవరున్నారు ? అనే విషయాలపై కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. యమనేపై హైదరాబాద్ లో మూడు డ్రగ్స్ కేసులు పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించారు. 11 మంది పాత డ్రగ్స్ వినియోగదారులు ఓ ఏజెంట్ నుంచి మత్తు పదార్థాలు కొనుగోలు చేసినట్టు తెలిపారు.