ఎవర్రా మీరు.. ఇంత టాలెంటెడ్గా ఉన్నారు.. గ్యాస్‌‌ రిపేరింగ్‌‌ ముసుగులో..

  • గ్యాస్‌‌ సిలిండర్‌‌‌‌ వాల్వుల్లో డ్రగ్స్.. 
  • ఓలా, ఉబెర్, ర్యాపిడో బైకులపై సప్లై.. రాజస్థాన్  గ్యాంగ్‌‌  కొత్త పన్నాగం
  • గ్యాస్‌‌ రిపేరింగ్‌‌ ముసుగులో హెరాయిన్  దందా
  • ఇద్దరు సభ్యులను అరెస్టు చేసిన ఎల్బీ నగర్‌‌‌‌ పోలీసులు

హైదరాబాద్‌, వెలుగు: డ్రగ్స్  సప్లయర్లు తెలివిమీరారు. పోలీసులకు చిక్కకుండా గ్యాస్‌ పైప్స్‌, వాల్వుల్లో డ్రగ్స్ ప్యాక్‌  చేసి సప్లయ్‌  చేస్తున్నారు. కస్టమర్ల లొకేషన్‌కు ఓలా, ఉబెర్‌‌, ర్యాపిడో  బైకులపై డెలివరీ చేస్తున్నారు. గత కొంత కాలంగా ఇలా డ్రగ్స్‌  సప్లయ్‌  చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎల్బీనగర్‌‌  ఎస్‌ఓటీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితులను రాజస్థాన్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారి వద్ద నుంచి 190 గ్రాముల హెరాయిన్‌, 10 ఎన్వలప్  కవర్లు, బైక్‌, రెండు మొబైల్ ఫోన్స్, వెయింగ్‌  మెషీన్  స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.23 లక్షలుగా అంచనా వేశారు. ఈ గ్యాంగ్‌  వివరాలను రాచకొండ సీపీ సుధీర్‌‌బాబు శుక్రవారం వెల్లడించారు.

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌‌కు చెందిన మహేశ్‌ (28), మహిపాల్‌ (19) కొంతకాలంగా నేరెడ్‌మెట్‌  ఆర్‌‌కేపురంలోని సైనిక్‌  నగర్‌‌లో నివాసం ఉంటున్నారు. మహేశ్‌, మహిపాల్‌  ఇద్దరూ గ్యాస్ మెకానిక్‌లుగా పనిచేస్తున్నారు. ఈజీ మనీ కోసం ఇద్దరూ హెరాయిన్  సప్లయ్  చేసేందుకు ప్లాన్  చేశారు. ఇందుకోసం రాజస్థాన్‌ లోని ఫలోడికి చెందిన శంషుద్ధీన్‌  అనే డ్రగ్స్‌ పెడ్లర్‌‌ వద్ద హెరాయిన్‌  కొనుగోలు చేశారు. ఇలా సేకరించిన హెరాయిన్‌ను హైదరాబాద్‌కు తరలించి కస్టమర్లకు సప్లయ్  చేస్తున్నారు. రెగ్యులర్  కస్టమర్లకు ఆర్డర్లపై డెలివరీ చేస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా ఎన్వలప్  కవర్లు, గ్యాస్ సిలిండర్  వాల్వుల్లో ప్యాక్‌  చేసి డెలివరీ చేస్తున్నారు. ఓలా, ఉబెర్  సహా ఇతర క్యాబ్‌ల  ద్వారా కస్టమర్ల లొకేషన్లకు చేరవేస్తున్నారు. ఒక్కో  సిలిండర్ వాల్వులో 5 గ్రాముల వరకు డ్రగ్స్‌  నింపుతున్నారు.

రాజస్థాన్ నుంచి హెరాయిన్‌  స్మగ్లింగ్
కొంతకాలంగా రెగ్యులర్  కస్టమర్లకు పలుమార్లు హెరాయిన్  సహా వివిధ రకాల డ్రగ్స్‌ను మహేశ్, మహిపాల్  విక్రయించారు. మహేశ్‌  గత నెల  రాజస్థాన్  వెళ్లాడు. శంషుద్దీన్‌  వద్ద 200 గ్రాముల హెరాయిన్  కొనుగోలు చేశాడు. ఇందుకు రూ.లక్షను ఫోన్‌ పేలో చెల్లించాడు. ఈనెల10న హైదరాబాద్  వచ్చాడు. మహిపాల్‌  ఇంట్లో షెల్టర్‌‌  తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి హెరాయిన్‌  అమ్మేందుకు ప్లాన్  చేశారు.

నేరెడ్‌మెట్‌  సహా ఎల్బీ నగర్‌  పరిసర ప్రాంతాల్లోని‌ పీకే గొటెమ్‌  అలియాస్  ప్రకాశ్‌, సురేష్‌, మనీశ్‌  బిష్ణోయ్‌, వినోద్‌  సహా మరికొంత మంది కస్టమర్లకు డ్రగ్స్ సప్లయ్  చేశారు. ఈ గ్యాంగ్‌పై సమాచారం అందుకున్న ఎల్బీనగర్  ఎస్‌ఓటీ పోలీసులు.. మహేశ్‌  గ్యాంగ్‌పై నిఘా పెట్టారు. ఇన్‌స్పెక్టర్‌‌ భాస్కర్‌ ‌రెడ్డి టీమ్‌  నేరెడ్‌మెట్‌  పోలీసుల సహకారంతో మహేశ్‌, మహిపాల్‌ను గురువారం సాయంత్రం అరెస్టు చేసింది. పోలీసులు వీరి వద్ద  నుంచి 190 గ్రాముల హెరాయిన్‌  స్వాధీనం చేసుకున్నారు.