- నిందితుల్లో కొరియోగ్రాఫర్, ఇద్దరు మహిళలు
- రూ.4.18 లక్షల విలువైనసరుకు స్వాధీనం
గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ హోటల్లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీలో పోలీసులు సోదాలు చేసి భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడితో పాటు పార్టీలో పాల్గొన్న ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.4.18 లక్షల విలువైన ఎండీఎంఏ, ఎల్ఎస్, చరాస్ను సీజ్ చేశారు. వివరాలను ఆదివారం మాదాపూర్ డీసీపీ ఆఫీసులో డీసీపీ వినీత్ వెల్లడించారు. ఏపీలోని విజయనగరం జిల్లా నీలవతి గ్రామానికి చెందిన గంగాధర్ (28).. విశాఖపట్నంలోని మద్దెలపాలెంలో ఉంటూ స్టాక్ మార్కెటింగ్ చేస్తున్నాడు. ఒడిశా నుంచి హైదరాబాద్ కు వచ్చి మూసాపేటలో ఉంటూ కొరియోగ్రాఫర్‌గా చేస్తున్న కన్హ మొహంతి (24), చందానగర్‌కు చెందిన అర్కిటెక్చర్ ప్రియాంకా రెడ్డి, కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన సఖి (22) .. గంగాధర్ కు ఫ్రెండ్స్ అయ్యారు. గంగాధర్ సులభంగా డబ్బు సంపాదించడానికి బెంగళూరు నుంచి నగరానికి డ్రగ్స్ తెప్పించాడు.
డ్రగ్స్ పార్టీ నిర్వహణకు ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా గంగాధర్, మొహంతి కలిసి బెంగళూరులో ఓ వ్యక్తి వద్ద ఎండీఎంఏ, గంజాయి, ఇతర డ్రగ్స్ కొని సిటీకి వచ్చారు. గచ్చిబౌలి డీఎల్ఎఫ్ సమీపంలోని ఓ బోటిక్ హోటల్ లో ఒక రూంలో గత నెల 30న డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి ప్రియాంకా రెడ్డి, సఖి వచ్చారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు కలిసి హోటల్లో సోదాలు నిర్వహించారు. గదిలో ఉన్న నలుగురిని అరెస్టు చేశారు. డ్రగ్స్ తో పాటు 6 మొబైల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి పోలీసులు ఈ ఘటనపై కేసును నమోదు చేశారు. నలుగురిని రిమాండ్‌కు తరలించారు.