- కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర సర్కారు
- 97 మంది కొత్త ఏఎంవీఐలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోజు రోజుకూ పెరుగుతున్న గంజాయి అక్రమ రవాణాకు చెక్‌పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా రోడ్డు మార్గం ద్వారా వాహనాల్లో పెద్ద ఎత్తున తరలిస్తున్నట్టు గుర్తించిన సర్కారు దీనికి అడ్డుకట్ట వేయడంపై ఫోకస్ పెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేని విధంగా గంజాయి రవాణాపై పటిష్ట నిఘాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి ట్రాన్స్పోర్ట్ శాఖ పదును పెట్టింది. ఇటీవలే 97 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ (ఏఎంవీఐ)ను నియమించిన ప్రభుత్వం వారికి మొదటగా ఎన్‌ఫోర్స్‌మెంట్ లోనే బాధ్యతలను అప్పగించింది.
రాష్ట్రంలో గంజాయిని ఉక్కుపాదంతో అణచివేయాలని సీఎం రేవంత్ రెడ్డి వివిధ విభాగాల ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దీనిపై సంబంధిత శాఖ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గకుండా గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి, సమాజంలో రవాణా శాఖ ప్రతిష్టను పెంచేలా కృషి చేయాలని సూచించారు.
చెక్‌పోస్టులతో పటిష్ట నిఘా
తెలంగాణకు ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్నాటకతో సరిహద్దులు ఉండగా.. మొత్తం 14 అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద ప్రభుత్వం నిఘాను తీవ్రతరం చేసింది. కొత్తగా నియమితులైన ఏఎంవీఐలకు రవాణా శాఖలో రెగ్యులర్ డ్యూటీలకు బదులు ఎన్‌ఫోర్స్ మెంట్ బాధ్యతలను మాత్రమే అప్పగించి, వారి పనితనానికి గంజాయిని అడ్డుకోవడమే గీటురాయిగా నిర్ణయించింది.
రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి లభ్యమవుతుండడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలపై గట్టి నిఘాను పెంచింది. ఇదే సమయంలో రవాణా శాఖలోని ఇతర నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. ఈ బాధ్యతలు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి అప్పగించారు. ముఖ్యంగా భారీ వాహనాలు హెవీ లోడ్, హెవీ హైట్ తో రోడ్లపైకి రావడాన్ని రవాణా శాఖ ఇక నుంచి తీవ్రంగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నది. లైఫ్ ట్యాక్స్ లేని వెహికల్స్, డ్రైవింగ్ లైసెన్స్ లేని డ్రైవర్లపై గట్టి నిఘా పెట్టి.. అటు నిబంధనలు అమలుతోపాటు ఇటు రవాణా శాఖకు ఆదాయం సమాకూర్చే మార్గంపై దృష్టి పెట్టారు.