నలుగురిని అరెస్ట్ చేసిన యాదాద్రి జిల్లా పోలీసులు
రెండు కార్లు.. 35 కిలోల గంజాయి స్వాధీనం
యాదాద్రి, వెలుగు : ఎస్కార్ట్ తో కారులో గంజాయి ని తరలిస్తుండగా యాదాద్రి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేసి 35 కిలోల గాంజాను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. నలుగురు వ్యక్తులు ఆంధ్రలో గంజాయిని కొనుగోలు చేసి ప్యాక్ చేసి ఒక కారులో పెట్టారు. మరో కారుతో ఎస్కార్ట్‌గా మంగళవారం హైదరాబాద్ కు బయలుదేరారు. ముందుగా వెళ్లే ఎస్కార్ట్ కారులోని ఇద్దరు వ్యక్తుల సూచనలతో గంజాయి ఉన్న కారు వెనకాల ఫాలో అవుతుంది. విజయవాడ -–హైదరాబాద్ హైవే పై టోల్గేట్వద్ద పోలీసులకు దొరుకుతామనుకుని భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి వైపు వెళ్లారు. అక్కడి నుంచి బీబీనగర్ టోల్ గేట్పక్క నుంచి వెళ్తుండగా భువనగిరి రూరల్ పోలీసులు రెండు కార్లను ఆపారు. అందులోని వ్యక్తులు ఆందోళనగా కన్పించడంతో తనిఖీ చేయగా 35 కిలోల గంజాయి కన్పించింది. నలుగురిని అదుపులోకి తీసుకొని, వారి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ వి. సంతోశ్‌కుమార్ తెలిపారు. పట్టుబడిన నిందితుల పూర్తి వివరాలు ఇయాల వెల్లడిస్తామని చెప్పారు.