డ్రంకన్ డ్రైవ్ లెక్కనే డ్రగ్ టెస్టులు
డ్రగ్ ఎనలైజర్లు కొనుగోలు చేయనున్న పోలీసులు
ఉమ్ము, మూత్రం శాంపిళ్లతో పరీక్ష.. నిమిషాల్లో రిపోర్టు
డ్రగ్స్ తీసుకొని నాలుగు రోజులైనా అందులో తెలుస్తది
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ తీస్కున్నోళ్లను వెంటనే గుర్తించేందుకు కొత్త టెక్నాలజీని వినియోగించాలని పోలీసులు నిర్ణయించారు. ఇందుకోసం డ్రగ్ ఎనలైజర్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. వీటి ద్వారా ఉమ్ము, మూత్రం శాంపిళ్లను సేకరించి నిమిషాల్లోనే డ్రగ్ టెస్ట్ చేయనున్నారు. డ్రంకన్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నట్లే, డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు ఇకపై ముఖ్యమైన ప్రాంతాల్లో డ్రగ్ టెస్టులు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే విదేశాలతో పాటు మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వినియోగిస్తున్న డ్రగ్ హంటర్ ఎనలైజర్లను కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆ డిజిటల్ డివైజ్ ల పనితీరు గురించి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ ఆమోదంతో డ్రగ్ ఎనలైజర్లను కొనుగోలు చేసి, ముందుగా ట్రయల్ రన్ చేయనున్నారు. ఆ తర్వాత సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించనున్నారు.
ఇట్ల టెస్టు చేస్తరు..
డ్రంకన్ డ్రైవ్ చెకింగ్ తరహాలోనే డ్రగ్ ఎనలైజర్‌తో చెకింగ్ చేస్తారు. ఇందులో భాగంగా ముందుగా ఉమ్మును సేకరించి, డ్రగ్ ఎనలైజర్ లో టెస్టు చేస్తారు. ఒకవేళ అందులో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే, మూత్రం శాంపిల్ ను సేకరిస్తారు. ఆ తర్వాత రెండు శాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తారు. ఆ రిపోర్టు ఆధారంగా ఎలాంటి డ్రగ్స్ తీసుకున్నారనేది నిర్ధారిస్తారు. కాగా, డ్రగ్ తీస్కున్న వ్యక్తిలో దాని కంటెంట్ మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఉంటుంది. కాబట్టి డ్రగ్ తీస్కొని నాలుగు రోజులైనా ఎనలైజర్ పట్టేస్తుంది.
నిఘా పెట్టి పట్టుకుంటరు..
డ్రగ్ ఎనలైజర్ల వినియోగంపై పోలీసులకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. డివైజ్ వినియోగంతో పాటు లీగల్ సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ తీసుకొని దొరికినోళ్ల డేటాను రికార్డుల్లోకి ఎక్కిస్తారు. పోలీస్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. కేస్ స్టడీల ఆధారంగా డ్రగ్స్ సప్లయ్ జరిగే ఏరియాలను గుర్తిస్తారు. డ్రగ్ సప్లయర్స్ తో పాటు పబ్స్, రెస్టారెంట్లు, పబ్లిక్ ప్లేసులలోనూ నిఘా పెడతారు. ఆయా ప్రాంతాల్లో కస్టమర్లను గుర్తించి ఉమ్ము టెస్టు చేస్తారు. వారికి సప్లయ్ చేసిన డ్రగ్ పెడ్లర్ల వివరాలు సేకరిస్తారు.
ముందు ట్రయల్ రన్ చేస్తం..
డ్రగ్ ఎనలైజర్లను చెన్నై, కర్నాటక, కొచ్చిలో వినియోగిస్తున్నారు. డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు రాష్ట్రంలోనూ వాటిని వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వివిధ దేశాలకు చెందిన ఎనలైజర్లను పరిశీలిస్తున్నాం. మొదట ట్రయల్ రన్ చేసి, తర్వాత పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెస్తాం.
- సీనియర్ పోలీస్ ఆఫీసర్, హైదరాబాద్