
కస్టమ్స్ అధికారులు ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా డ్రగ్స్ సరఫరా ఆపడం లేదు దుండగులు. గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా చేసే ప్రయత్నం జరుగుతూనే ఉంది. తాజాగా చెన్నై ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. డ్రగ్స్ ను అక్రమంగా విదేశాల నుంచి ఇండియాకు తీసుకొస్తూ పట్టబడ్డారు. గురువారం (ఏప్రిల్ 10) చెన్నై విమానాశ్రయంలో వేర్వేరు కేసుల్లో రూ.8 కోట్ల విలువైన డ్రగ్స్ ను సీజ్ చేసి, నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు అధికారులు.
మొదటి కేసులో జాంబియా నుంచి ఒక మహిళ డ్రగ్స్ తో వస్తుందని వచ్చిన పక్కా సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. మార్చి 26న సెనెగల్ నుంచి దుబాయ్ మీదుగా ఎమిరేట్స్ ఎయిర్ లైన్ ఫ్లైట్ లో వచ్చిన మహిళను అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొంత మొత్తం12 సిలిండర్ ట్యూబుల్లో, మిగతా 460 గ్రాముల తెల్లని పౌడర్ వంటి పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నార్కోటిక్ టెస్టుల్లో కొకైన్ గా నిర్ధారించారు. మొత్తం 610 గ్రాములు ఉన్న కొకైన్ విలువ రూ.6 కోట్ల 10 లక్షలుగా నిర్ధారించారు. మహిళను అదుపులోకి తీసుకుని జుడీషియల్ కస్టడీకి పంపించారు.
Also Read:-బెంగళూరులోని తెలుగు ఫ్యామిలీల నెత్తిన భారం, కొత్త రూల్ నేటి నుంచే అమలు..
ఏప్రిల్ 1 న మరో కేసులో బ్యాంకాక్ నుంచి వస్తున్న ఇండియన్ డ్రగ్స్ తెస్తున్నాడని వచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నారు. అతని బ్యాగ్ లో 1.82 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సిల్వర్ ప్యాకేట్లలో దాచిన ఈ గంజాయి విలువ సుమారు కోటి 8 లక్షల రూపాయలుగా కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. రెండు కేసులలో పట్టుబడిన నిందితులను జుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు.