లిక్కర్​ సేల్స్​ కోసం డ్రంకెన్​ డ్రైవ్​ టెస్టులు తగ్గిస్తున్నరు

  • నాలుగంచెల వ్యూహంతో ఫుల్లుగా అమ్మకాలు
  • మూడో వంతుకు పడిపోయిన డ్రంకెన్​ డ్రైవ్ ​టెస్టులు
  • రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు యాక్సిడెంట్లు
  • లిక్కర్​ సేల్స్​ కోసం
  • డ్రంకెన్​ డ్రైవ్​ టెస్టులు తగ్గిస్తున్నరు
  • నాలుగంచెల వ్యూహంతో ఫుల్లుగా అమ్మకాలు 
  • మూడో వంతుకు పడిపోయిన డ్రంకెన్​ డ్రైవ్​ టెస్టులు
  • రాష్ట్రంలో పెరుగుతున్న యాక్సిడెంట్లు

ఈ నెల 16న నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలోని రాయిచెడుకు చెందిన 37 ఏండ్ల నక్కెరకంటి అమృత, 24 ఏండ్ల చింతకుంట్ల అనిత, 42 ఏండ్ల ఎత్తపు హుసేనమ్మ రోడ్డు పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అంతలోనే శ్రీశైలం హైవే నుంచి సుమారు 120 కిలోమీటర్ల వేగంతో వచ్చిన కారు వీరి మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అమృతమ్మ, అనిత అక్కడికక్కడే ప్రాణాలు వదలగా, హుసేనమ్మ తీవ్రంగా గాయపడి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. డ్రైవర్​మద్యం మత్తులో ఓవర్​స్పీడ్​తో నడపడం వల్లే  ఈ యాక్సిడెంట్​జరిగిందని పోలీసులు చెప్పారు. 
వరంగల్​, వెలుగు:  
ఖాళీ అయిన ఖజానా నింపడానికి రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్​ సేల్స్​పెంచడమే టార్గెట్​గా పెట్టుకున్నది.  ఇందుకున్న అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నది.  అనధికారికంగా ఇప్పటికే మూడంచెల వ్యూహం అమలు చేస్తున్నది.  ఇందులో భాగంగా ఊరూరా ఓపెన్‍  బెల్ట్​షాపులు,  క్వార్టర్​ బాటిల్​పై పది రూపాయల తగ్గింపు,  బార్‍ షాపుల్లోనూ 90 ఎంఎల్​, క్వార్టర్‍,  హాఫ్‍ బాటిల్స్​అందుబాటులోకి తెచ్చింది. లేటెస్ట్​గా  ఫోర్త్​ ప్లాన్​అమలు ప్రారంభించింది. ఈక్రమంలోనే పలు జిల్లాల్లో  డ్రంకెన్​ డ్రైవ్​ టెస్టులు మూడోవంతుకు తగ్గించింది. ఇక దొర్కుతామనే భయం లేక మందుబాబులు తాగి వెహికిల్స్​ నడుపుతున్నారు. ఫలితంగా ఖజానాకు ఆమ్దానీ పెరుగుతున్నప్పటికీ రోడ్డు యాక్సిడెంట్లలో జనాలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నరు. 

నెలకు రూ.4 వేల కోట్లు.. 

ఉమ్మడి రాష్ట్రంలో  ఏటా దాదాపు రూ.10 వేల కోట్ల లిక్కర్ సేల్ జరిగేది.  తెలంగాణ ఏర్పడ్డాక 2014-–15లో లిక్కర్​ ఆమ్దానీ రూ. 10.88 వేల కోట్లు రాగా.. 2018–-19లో ఇది రూ.20.85 వేల కోట్లకు పెరిగింది. అంటే ఐదేండ్లలో డబుల్ అయింది. 2021-–22లో ఆల్ టైం రికార్డ్​  రూ.34,353 కోట్ల సేల్స్​ జరిగాయి.  గతంలో  లిక్కర్​ ఏటా వెయ్యి కోట్లు,  రూ.2 వేల కోట్లు పెంచుకోగా.. 2021తో పోలిస్తే 2022లో అమాంతం రూ.15 వేల కోట్ల సేల్స్​ పెరిగాయి. ఈ లెక్కన నెలకు  దాదాపు రూ.3 వేల కోట్ల ఆమ్దానీ పెంచుకుంది. కాగా,  ఈ ఏడాదిలో  నెలకు రూ.4 వేల కోట్ల ఇన్​కం వచ్చేలా టార్గెట్‍ పెట్టి ​అమలు చేస్తున్నారు.

తగ్గిన డ్రంకెన్​ డ్రైవ్​ టెస్టులు

రాష్ట్రంలో  లిక్కర్‍ సేల్స్​ పెంచడానికే   కొన్నెండ్లుగా సర్కారు  ఫోర్త్​ ప్లాన్‍ అమలు చేస్తూ  జిల్లాల్లో డ్రంకెన్​ డ్రైవ్​ టెస్టులు తగ్గించారనే ఆరోపణలు వినపడ్తున్నాయి.  మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉండే పలు జిల్లాల్లో ఈ ఏడాది డ్రంకెన్​ డ్రైవ్​ కేసులు మూడొంతులు తగ్గాయి.  ఉదాహరణకు.. హైదరాబాద్‍ తర్వాత పెద్దదైన వరంగల్‍ పోలీస్‍ కమిషనరేట్‍లో 2022  ఏడాదిలో 23,669 డ్రంకెన్​ డ్రైవ్​ కేసులు నమోదు చేశారు. నెలకు సగటున 1,973 కేసులు బుక్‍ చేశారు.  కాగా, 2023 జనవరి నుంచి మే 31 వరకు మొదటి ఐదు నెలలు కలిపి కేవలం 2,692 కేసులు రాశారు. ఈ లెక్కన సగటున నెలకు 538 నమోదయ్యాయి.  ఇక కరీంనగర్ కమిషనరేట్‍ పరిధిలో గతేడాది 6,786 కేసులు నమోదవ్వగా ఇప్పుడు ఆరో నెల వచ్చేసరికి కేవలం 1,849 నమోదయ్యాయి. రామగుండం పరిధిలో గతంలో నెలకు 1,300 పైగా  కేసులు రాయగా జూన్‍ సగం నెల వచ్చేసరికి కేవలం 344 మాత్రమే నమోదయ్యాయి.

పెరుగుతున్న యాక్సిడెంట్లు..

రాష్ట్రవ్యాప్తంగా బెల్టుషాపుల్లో ఎనీ టైం లిక్కర్​ దొరుకుతుండడంతో మందుబాబులు నిత్యం మత్తులో జోగుతున్నారు. దీంతో  క్రైం రేటు విపరీతంగా పెరుగుతోంది.  ముఖ్యంగా డ్రంకెన్​ డ్రైవ్​ టెస్టులు తగ్గడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. నిజానికి 2021తో పోలిస్తే 2022లోనే డ్రంకెన్​ డ్రైవ్​ టెస్టులు తగ్గాయి. 2021లో ట్రాఫిక్ జరిమానాలు రూ.877 కోట్లు వసూలు కాగా,  2022లో  రూ.612కోట్లకు తగ్గడం గమనార్హం.  ఫలితంగా నిరుడు  రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. 2021లో 19,248 రోడ్డు ప్రమాదాల్లో 6,690 మంది చనిపోగా,  2022లో ప్రమాదాల సంఖ్య19,456కి, మృతుల సంఖ్య 6,746కి పెరిగింది. ప్రస్తుతం జనవరి నుంచి క్రమంగా డ్రంకెన్​ డ్రైవ్​ టెస్టులు తగ్గడంతో ఈ ఏడాది కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నట్లు పోలీసులు చెప్తున్నారు.  అఫీషియల్ డాటా బయటకు రాకున్నా నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల్లో 40 నుంచి 50శాతం వరకు తాగినడపడమే కారణమని అంటున్నారు. 

12 గంటల వ్యవధిలో నాలుగు హత్యలు.. 

గ్రేటర్​ హైదరాబాద్​లో మే11 రాత్రి నుంచి 12 ఉదయం వరకు 12 గంటల వ్యవధిలో నాలుగు మర్డర్లు జరిగాయి.  ఆ పది రోజుల వ్యవధిలో రాజధాని పరిధిలో 8 హత్యలు జరిగాయని, ఈ మర్డర్లన్నీ మద్యం మత్తులో జరిగినవేనని ఎంక్వైరీలో తేలడంతో పోలీసులు దిగ్ర్భాంతికి లోనయ్యారు. అటు రోడ్డు యాక్సిండెట్లు పెరగడంతో డ్రంకెన్​ డ్రైవ్​ టెస్టులు పెంచాలని ఉన్నతాధికారులు అనుకున్నప్పటికీ సర్కారు నుంచి సహకారం లేకపోవడంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని ఓ పోలీస్​ అధికారి తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు.

లిక్కర్​ తోనే యాక్సిడెంట్లు ఎక్కువైనయ్​

ప్రస్తుతం  క్రైమ్​ రేటులో 95 శాతం మద్యం మత్తులోనే జరుగుతున్నాయి.  అలాగే 40 నుంచి 50 శాతం యాక్సిడెంట్లకు తాగిన మత్తులో వెహికిల్స్​ నడపడమే కారణమవుతోంది.  అడుగుకో  వైన్, బార్, బెల్ట్ షాపులతో లిక్కర్  ఇప్పుడు పెద్దొళ్లకే  కాకుండా చిన్న పిల్లలు, మహిళలకు కూడా అందుబాటులో ఉంటున్నది. దీంతో అదేస్థాయిలో యాక్సిడెంట్లు, మర్డర్లు, రేప్​లాంటి  కేసులు పెరుగుతున్నాయి. 
- తౌటం రాము, నిర్వాహకులు, హెల్పింగ్ హ్యాండ్ ఆల్కహాల్  డీఅడిక్షన్ సెంటర్
మొదటి అంచె​:  24 గంటలు లిక్కర్ అందుబాటు(విత్​ బెల్ట్​షాపు)
రెండో అంచె:  బీరు మినహా అన్నీ బ్రాండ్ల రేటు తగ్గింపు
మూడో అంచె:  బార్​ షాపుల్లోనూ 90ఎంఎల్​, క్వార్టర్​, హాఫ్​బాటిళ్లు
నాలుగో అంచె: డ్రంకెన్​ డ్రైవ్​ టెస్టులు తగ్గించడం