ఉన్మాదమా.. బలుపా : తాగి కారుతో మహిళను చంపి.. రోడ్డుపై మరో రౌండ్ అంటూ వీరంగం

ఉన్మాదమా.. బలుపా : తాగి కారుతో మహిళను చంపి.. రోడ్డుపై మరో రౌండ్ అంటూ వీరంగం

ఏం చేశామో.. ఎలాంటి పని చేశామో.. ఎంత కిరాతకంగా వ్యవహరించామో కూడా సోయి లేదు వాడికి.. ఫుల్ గా మందు కొట్టి.. 120 కిలోమీటర్ల స్పీడ్ తో కారు నడుపుతూ.. రోడ్డుపై నలుగురి ఢీకొట్టాడు. ఓ మహిళ స్పాట్ లో చనిపోగా.. మరో ముగ్గురు చావు బతుకుల్లో ఉన్నారు.. ఇంత ఘోర ప్రమాదం జరిగితే.. కారు డ్రైవింగ్ చేసిన వాడు మాత్రం.. ఎంతో తీరిగ్గా.. హ్యాపీగా రోడ్డుపైకి వచ్చి మరో రౌండ్.. మరో రౌండ్ అంటూ కేకలు వేయటం చూసి స్థానికులే షాక్ అయ్యారు. ఈ ఘోర ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా.. మన గుజరాత్ రాష్ట్రం వడోదరలో.. అందులోనూ మద్య నిషేధం ఉన్న రాష్ట్రంలో.. 

గుజరాత్ రాష్ట్రం వడోదర సిటీలో.. 2025, మార్చి 13వ తేదీ అర్థరాత్రి రక్షిత్ చౌరాసియా కుర్రోడు.. వడోదరలోని లా కాలేజీ లాయర్ చదువుతున్నాడు. చౌరాసియా అతని మరో ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ఫుల్ గా తాగిన రక్షిత్ చౌరాసియా కారు నడుపుతూ.. కరేలిబాగ్ ఏరియాలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న నలుగురిని ఢీకొట్టాడు. ఓ మహిళ చనిపోగా.. మరో ముగ్గురు ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నారు. యాక్సిడెంట్ తర్వాత.. స్పాట్ లోనే.. నడి రోడ్డుపై వీడు చేసిన అల్లరే ఇప్పుడు పెద్ద ఇష్యూ అయ్యింది.

రోడ్డుపై చల్లాచెదురుగా మనుషులు గాయాలతో పడి ఉంటే.. వాళ్ల మధ్య నిలబడి మరో రౌండ్.. మరో రౌండ్ అంటూ కేకలు వేశాడు. ఈ ఘటనతో షాక్ అయిన స్థానికులు కొందరు అతనితోపాటు.. కారు దిగి పారిపోతున్న మరో ముగ్గురు యువకులకు ఛేజ్ చేసి పట్టుకున్నారు. విషయం తెలిసి వచ్చిన పోలీసులు.. నలుగురిని అదుపులోకి తీసుకునే సమయంలో స్థానికులు తిరగబడ్డారు. యాక్సిడెంట్ చేసి మనుషులను చంపిందే కాక.. వీళ్లు చేసిన అల్లరికి స్పాట్ లోనే వీళ్లకు శిక్ష విధించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు స్వల్ప లాఠీఛార్జితో నలుగురు కుర్రోళ్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

డ్రంక్ అండ్ డ్రైవ్, యాక్సిడెంట్ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్నారు.