రఘనాథపాలెం మండలం బూడిదపాలెంలో చెత్త నిర్వహణకోసం ఏర్పాటు చేసిన ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో ట్రాక్టర్ నడిపి గ్రామస్తులను హడలెత్తించాడు. ఫుల్లుగా మద్యం సేవించి వీధుల వెంటఅడ్డగోలుగా ట్రాక్టర్ నడుపుతూ ఓ ఇంటిని ఢీకొట్టడంతో పహారీ గోడ కూలిపోయింది. గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా దీక్షలు చేస్తుండగా.. గ్రామంలో చెత్త నిర్వహణకోసం తాగుబోతు వ్యక్తి ని ట్రాక్టర్ డ్రైవర్గా నియమించడం వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు వాపోతున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ పంచాయతీ కార్మికులు దీక్షలో ఉండగా.. గ్రామంలో చెత్త నిర్వహణకోసం శాంసన్ అనే వ్యక్తిని ట్రాక్టర్ డ్రైవర్ గా పంచాయతీ అధికారులు నియమించారు. అయితే శాంసన్ రోజు తాగుతూ వీధుల వెంట పడిపోతుంటాడని స్థానికులు తెలిపారు. ఫుల్లుగా మద్యం సేవించి ట్రాక్టర్ నడుపుతూ వెళ్లి ఏకంగా వార్డు మెంబర్ కేలోత్ సురేష్ ఇంటి ప్రహారీ గోడను ఢీకొట్టాడు. ఇంత జరిగినా ఇంకా శాంసన్ మత్తులోనే ఉండి పడిపోయి ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాక్టర్ నడిపే సమయంలో మనుషులకో.. విద్యార్థులకో ఢీకొట్టి ఉంటే పరిస్థితి ఏంటని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.