భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రిలో మద్యం సేవించి ఓ యువకుడు హల్చల్ చేశాడు. ఇల్లందు మండలం, పోచారం గ్రామానికి చెందిన జర్పుల శివ తన అత్తగారి ఇంట్లో ఓ కార్యక్రమానికి తన భార్యతో కలిసి.. ఇల్లందు మండలం ధనియాలపాడు గ్రామానికి వెళ్లాడు. అయితే శివకు సరిపడా మద్యం పొయ్యలేదనే కారణంతో అత్తమామ, బామ్మర్దులతో గొడవపడ్డారు. మధ్యలో అడ్డు వచ్చిందని భార్య భవానిని కొట్టాడు. శివ తరచుగా తన సోదరితో గొడవపడి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అతని బామ్మర్దులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో మనస్థాపం చెందిన శివ మద్యం మత్తులో బండరాయితో తల పగలగొట్టుకున్నాడు. వెంటనే చికిత్స నిమితం ఆయన భార్య ఇల్లందు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. శివ మద్యం మత్తులో పెద్ద ఎత్తున కేకలు వేయడం, వెంట ఉన్న తన భార్యను కొట్టడం, వైద్యం చేసేందుకు డాక్టర్లకు సహకరించకపోవడం, ఆసుపత్రి నుండి రోడ్డు మీదికి, రోడ్డు నుండి ఆస్పత్రికి పరుగులు తీస్తూ బీభత్సం సృష్టించాడు.
పలుమార్లు రోడ్డుపైకి వెళ్లి వచ్చి పోయే వాహనాలకు అడ్డంగా పడుకొని హల్ చల్ సృష్టించాడు శివ. ఇలా రెండు, మూడు గంటల పాటు గందరగోళం చేశాడు. స్థానిక పోలీసుల జోక్యంతో ఆస్పత్రి వైద్య సిబ్బంది బలవంతంగా చికిత్స చేయించడంతో శివకు మందు మత్తు దిగిపోయి నిద్రలోకి జారుకున్నాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. శివపై పోలీసులు కేసు నమోదు చేశారు.