ఎండు కూరలు తగ్గుతున్నయ్​!

కాశ్మీర్​ గురించి ఎంత విన్నా ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది. అక్కడ.. కూరగాయల్ని కోసి, ఎండబెట్టి, ఆ తొక్కల్ని దాచి, చలికాలంలో వండుకొని తింటారు. ఈ సంగతి బహుశా చాలా మందికి తెలిసుండకపోవచ్చు.  వంకాయ, సొరకాయ, టమాట ఏదైనా దండలా గుచ్చుకుని గోడలకు వేలాడదీస్తారు. వాటిని ఇలా ఎండబెట్టాక మంచు కురిసే రోజుల్లో వాడుకుంటారు.  ఎప్పటి నుంచో వస్తున్న ఈ అలవాటుని ఫ్యాకేజీ ఫుడ్​ మార్చేసింది. డ్రై ఫుడ్​ స్థానంలో ఫ్రెష్​ ఐటమ్స్​ అందుబాటులోకి వస్తున్నాయి.

కాశ్మీర్​ అసలే మంచు ప్రాంతం. పైగా ప్రస్తుతం శీతాకాలం. ఎముకలు కొరికే ఇలాంటి చలి వాతావరణంలో అక్కడ మనుషులు ఏ ఇబ్బందీ లేకుండా బతకటమే చాలా కష్టం. అలాంటిది.. ఇక మొక్కలేం నిలబడతాయి. యాపిల్ చెట్లను వదిలేస్తే.. కూరగాయల మొక్కలు బతకవు. కాయలు కాయటం దాదాపు అసాధ్యం. అందువల్ల అక్కడి ప్రజలకు వింటర్​లో ఫ్రెష్​ కాయగూరలు దొరకాలంటే చాలా కష్టం. ఈ పరిస్థితి తట్టుకోవటానికి ఏటా  సమ్మర్​లోనే కూరగాయలు కోసి, ఎండబెట్టి, ఆ తొక్కల్ని చలికాలం కోసం దాచుకునేవారు. కొన్నేళ్ల క్రితం వరకు కూడా కాశ్మీర్​లోని ప్రతి ఇంట్లో గోడలకు కూరగాయల దండలు వేలాడుతూ కనిపించేవి. మన దగ్గర పండగలప్పుడు బంతిపూల దండల్ని గడపలకు కడతారు కదా. అలా అక్కడ కూరగాయల దండలు దర్శనమిచ్చేవి. చలికాలం కాస్తా ఆకలి కాలంగా మారకుండా ఇళ్లల్లోని ఆడవాళ్లు ముందు జాగ్రత్తలు తీసుకునేవారు.

సరుకులు దొరకని పరిస్థితి

చలి రోజుల్లో దట్టమైన మంచు వల్ల జమ్మూ–శ్రీనగర్​ నేషనల్​ హైవేపై రాకపోకలు నిలిచిపోయేవి. ఆ ప్రాంతానికి దేశంతో సంబంధాలు తెగిపోయినట్లయ్యేది. కాశ్మీర్​కి నిత్యవసరాల రవాణా ఆగిపోయేది. లోకల్​ మార్కెట్లలో సరుకులు దొరికే పరిస్థితి ఉండేది కాదు. ఈ పెద్ద రోడ్డును ఒక్కోసారి కొన్ని నెలల పాటు మూసేసేవారు. మాంసం కూర కోసం జనం మొహం వాచిపోయేవారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆకలి తీర్చుకోవడానికి ఎండబెట్టినవే దిక్కయ్యేవి. ఉన్నోడికైనా, లేనోడికైనా ఇవే అనుభవాలు ఎదురయ్యేవి. కడుపు మాడకుండా ఉండాలంటే ఎండా కాలం, వానా కాలం సాధ్యమైనన్ని వెరైటీల కూరగాయల్ని, చేపల్ని తాడుకి కట్టి ఎండ తగిలే చోట ఇంటి గోడలకు వేలాడదీసేవారు. కాశ్మీర్​లో ప్రతి ఇల్లాలూ ప్రతి సంవత్సరమూ ఇలా చేయాల్సిందే. ఇప్పుడు రోజులు మారాయి. అలాంటి దారుణమైన కరువు పరిస్థితి చాలా వరకు కనుమరుగవుతోంది. కాలం ఏదైనా తిండికి కొదవలేకుండా పోయింది.

ఆ దారి.. రహదారిగా మారింది

చలి కాలంలో దట్టమైన మంచు కారణంగా కొన్ని నెలలపాటు మూతపడి ఉండి, పబ్లిక్​ని నానా యాతనలు పెట్టే శ్రీనగర్​–జమ్మూ హైవే ఇప్పుడు సౌకర్యవంతంగా మారింది. ఎంత పెద్దఎత్తున మంచు పేరుకుపోయినా రెండు మూడు రోజుల్లోనే పూర్తిగా తొలగించి రాకపోకల్ని తిరిగి ప్రారంభిస్తున్నారు. దీంతో సరుకుల రవాణాకు ఎలాంటి ఇబ్బందీ ఉండట్లేదు. ఎప్పటికప్పుడు తాజా కూరగాయలు, ఫ్రెష్​గా ప్యాక్​ చేసిన ఐటమ్స్ దొరుకుతున్నాయి. ఫలితంగా డ్రై ఫుడ్​కి డిమాండ్​ తగ్గిపోయింది. అతి కొద్దిమందే వాటిని ఆదరిస్తున్నారు.

ఓల్డ్​ శ్రీనగర్​లో ఇప్పుడంతా ఫ్రెష్​

శ్రీనగర్​తోపాటు కొన్ని పట్టణ ప్రాంతాల్లోనే అడపాదడపా ఇప్పటికీ ఈ ఎండబెట్టిన కూరగాయలు వాడుతున్నారు. ఇన్నాళ్లూ డ్రై ఫుడ్​ ఐటమ్స్ అమ్మిన చాలా షాపులు ఇప్పుడు గిరాకీ లేక మూతపడ్డాయి. కొంతమంది వ్యాపారులు లాభాలొచ్చే వేరే బిజినెస్​లు పెట్టుకున్నారు. ఓల్డ్​ శ్రీనగర్​లోని జామియా మసీదు మార్కెట్​లో సుమారు డజను షాపుల్లో చానాళ్ల నుంచి కొత్త వ్యాపారాలు నడుస్తున్నాయి. ఎండబెట్టిన తిండి దినుసులు అమ్మటం వల్ల రోజుకు మహా అయితే రెండు వేలే వస్తుంది. ఫ్యాక్టరీ ప్రొడక్ట్​లు అమ్మేవాళ్లు రూ.50 వేల దాక కళ్ల చూస్తున్నారు.

అంత తీరిక ఎవరికుంది?

డ్రైయింగ్​ ఫుడ్​ ఒకప్పుడు పాపులరేమో గానీ ఇప్పుడు కాదని కొందరు అంటున్నారు. ‘ఈ రోజుల్లో ఏది కావాలన్నా మార్కెట్​లో దొరుకుతోంది. అందువల్ల కూరగాయలు కోసి, ఎండబెట్టి, దాచుకొని తినాల్సింత అవసరం, ఆసక్తి ఎవరికీ లేకుండాపోయాయి. అసలు అంత తీరిక సమయం దొరకట్లేదు. ఈ సంప్రదాయాన్ని ముందు తరాలకు తెలియజేయాలనే ఉద్దేశం కూడా ఎవరిలోనూ కనబడట్లేదు. అందుకే ‘ఫాస్ట్​’ఫుడ్​ ఇష్టపడుతోంది’ అని మసూదా మూసూది అనే రిటైర్డ్​ టీచర్​ అభిప్రాయపడ్డారు.

కాశ్మీర్​లో అన్నీ ఎండబెట్టుడే!

కాశ్మీరీలు ఎండు కూరగాయల్ని ‘హఖ్​ స్యూన్​’గా పిలుచుకుంటారు. వీటితోనే చాలా రుచికరంగా వండుతారు. జీవితంలో ఒకసారైనా కాశ్మీరీల హఖ్​ స్యూన్​ వంటల్ని రుచి చూడాలంటారు ఫుడ్​ ఎక్స్​పర్ట్​లు.

 బాంచూంత్​ హాష్​ (ఎండు యాపిల్): మేలు రకం యాపిల్​ పళ్లను ఎంచుకుని రౌండ్​ ముక్కలుగా కోసేసి, ఎండబెడతారు. శీతాకాలంలో పెరుగు వేసి వండితే మొత్తంగా కొత్త రుచి వస్తుందట!

 రువాంగన్​ హష్​ (ఎండు టమాటాలు): ఏటా సెప్టెంబర్​లో లోకల్​ టమాటాలు మార్కెట్​కి వస్తాయి. వాటిని ఎక్కువగా కొనుక్కుని ముక్కలు చేసేసి ఎండబెడతారు. ఆ తర్వాత జాడీల్లో వేసుకుంటే ఎంతకాలమైనా పాడవవు. అన్ని కూరల్లోనూ రంగు, రుచి, చిక్కదనం కోసం వేస్తారు.

 గాగ్జి ఆరే (ఎండు తులిప్​ కాడలు):
వెజిటేరియన్లు లొట్టలేసుకుంటూ తినే వంటలో ఇదొకటి. తులిప్​ కాడల్ని తెచ్చి, మధ్యలో ఏమీ లేకుండా క్లీన్​ చేసి, చిన్న చిన్న ముక్కలుగా కోసి ఎండబెడతారు. తులిప్​ తిన్నట్లయితే జీర్ణశక్తి పెరుగుతుందని, బీపీ కంట్రోల్​లో ఉంటుందని న్యూట్రిషనిస్టులు చెబుతారు. నాన్​–వెజ్​ తినేవాళ్లు వీటిని మాంసంతో కలిపి వండుతారు.

వాంగన్​ హష్​ (ఎండు వంకాయ) : ఎండ తగిలే రోజుల్లోనే వంకాయల్ని ముక్కలుగా తరిగి వాటిలో గుజ్జును తీసేస్తారు. కొన్ని రకాలకు నిలువుగానూ, మరికొన్నింటిని అడ్డంగానూ కోస్తారు. జనుము నారకు ఆ ముక్కల్ని ఎక్కించి దండలుగా వేలాడదీస్తారు. వంకాయ దండలు దాదాపు ప్రతి కాశ్మీరీ ఇంట్లోనూ కనిపిస్తాయి. వంటకు ముందు వేడి నీటిలో నానబెడతారు.

 హఖ్​ పాలక్​ (ఎండు పాలకూర): కాడలు కట్​ చేసేసి, ఆకుల్ని ఎండబెట్టేస్తారు. పాలకూరలో తేమంతా వెళ్లిపోయేలా ఎప్పటికప్పుడు చూస్తుంటారు. పాలక్​తో చేసే వంటలన్నింటిలోనూ ఎండు పాలకూరనే వాడతారు.

అల్​ హష్​ (ఎండు సొరకాయ) : వెజ్​, నాన్​వెజ్​ తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే వాటిల్లో ఎండు సొరకాయ ఒకటి. నిలువు ముక్కల్ని ఆరబెట్టి దాచుకుంటారు. మటన్​, చికెన్​ల్లో కలిపి వండుకుంటారు.

ఎర్ర ముల్లంగి దుంప: ఎక్కువగా కాశ్మీరీలు ఇష్టపడతారు. కిలో రూ.200. ఆకులతో ఎండబెట్టినదైతే రూ.100.