వడ్ల కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలి : డీఎస్​ చౌహాన్

యాదాద్రి(ఆలేరు), వెలుగు : వడ్ల కొనుగోళ్లు  మరింత వేగవంతం చేయాలని స్టేట్​ సివిల్​ సప్లయ్​ కమిషనర్​ డీఎస్​ చౌహాన్​ ఆదేశించారు. జిల్లాలోని ఆలేరు మార్కెట్​ను ఆయన గురువారం సందర్శించారు. కొనుగోళ్లపై అక్కడే ఉన్న రైతులను అడిగి తెలుసుకున్నారు. వడ్లలోని తేమ శాతాన్ని ఆయన పరిశీలించారు. కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్లో మౌలిక వసతుల గురించి పలువురు రైతులు ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో వాటిని పరిష్కరించాలని అక్కడి స్టాఫ్​ను ఆయన ఆదేశించారు. 

నిబంధనల ప్రకారం వచ్చిన వడ్లను వెంటనే కొనుగోళ్లు జరుగుతాయని చెప్పారు. కొనుగోలు చేసిన రెండు, మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని తెలిపారు. మద్దతు ధర కంటే తక్కువకు దళారులకు వడ్లను అమ్మవద్దని రైతులకు సూచించారు. అకాల వర్షాలకు భయపడవద్దని,  వర్షాలను దృష్టి లో ఉంచుకొని కొనుగోలు కేంద్రాల వద్ద తగినన్ని టార్పాలిన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. అవసరమైన టార్పాలిన్లు అందజేస్తామని తెలిపారు. వడ్ల కుప్పలను కప్పి పెట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. ఆయన వెంట సివిల్​ సప్లయ్​ డీఎం గోపికృష్ణ, డీసీఎస్​వో శ్రీనివాసరెడ్డి, డీఏవో అనురాధ ఉన్నారు.