- కట్టి వందేళ్లవడంతో నిర్మాణాలను పరిశీలించిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించి వందేళ్లు అవుతున్న నేపథ్యంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ (డీఎస్ఏ) అధికారులు ఫోకస్ పెట్టారు. ఐదుగురు సభ్యులతో కూడిన టీమ్గతనెలలో రెండు ప్రాజెక్టుల వద్ద పర్యటించింది. పటిష్టంగా ఉన్నాయా? ఏమైనా రిపేర్లు అవసరమా? అనే విషయాలను పరిశీలించింది. గేట్లు, గోడలను తనిఖీ చేసింది. మూడేండ్లుగా వర్షా కాలంలో వరదలు పోటెత్తుతుండడంతో రోజుల తరబడి ఎఫ్ టీఎల్ లెవల్లో నీరు ఉంది. కంటిన్యూగా గేట్లు తెరిచి ఉన్నప్పటి పరిస్థితులను అధికారులు ఆరా తీశారు. డ్యామ్ లకి సంబంధించిన 30 ఏళ్ల వివరాలు అందజేయాలని ఆదేశించారు. నెల వారీగా ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలతోపాటు నీటి నిల్వ వివరాలు అడిగారు. జలమండలి అధికారులు ప్రస్తుతం వాటిని సిద్ధం చేస్తున్నారు. త్వరలో నివేదికను డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్లు ప్రభుత్వానికి అందించనున్నారు. తర్వాత అవసరమైతే రిపేర్లు చేస్తారు.
వరదలు తట్టుకునేందుకు..
1908లో భారీ వరదలు రావడంతో అప్పటి నిజాం ప్రభుత్వం వరదలను తట్టుకునేందుకు 1912లో ఉస్మాన్ సాగర్నిర్మాణం ప్రారంభించి 1920లో పూర్తి చేసింది. ఈసా నదిపై1920లో హిమాయత్ సాగర్రిజర్వాయర్ నిర్మాణం ప్రారంభించి1927లో పూర్తి చేసింది. హిమాయత్‌సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 2.9 టీఎంసీలు కాగా, ఉస్మాన్ సాగర్ కెపాసిటీ 3.9 టీఎంసీలు. ఉస్మాన్సాగర్క్యాచ్మెంట్ఏరియా 688.93 ఎకరాలు, హిమాయత్‌సాగర్ 783 ఎకరాల మేర విస్తరించి ఉంది. ఉస్మాన్‌సాగర్ నుంచి ప్రతిరోజు 26 మిలియన్ గ్యాలన్ల నీరు అందుబాటులో ఉంటుండగా, హిమాయత్సాగర్నుంచి 18 మిలియన్‌గ్యాలన్ల నీరు తీసుకునే అవకాశం ఉంది. అయితే రెండేళ్లుగా వీటి నీటిని సిటీకి ఎక్కువగా వినియోగించడంలేదు.
నిర్వహణపై దృష్టి పెట్టట్లే..
జంట జలాశయాల నిర్వహణను అధికారులు పట్టించుకోవడం లేదని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. నిర్మించి వందేండ్లు అవుతుండడంతో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేకుంటే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణాల వద్ద బ్లాస్టింగ్ లు, సెల్లార్లు తవ్వడం, విచ్చలవిడిగా బోర్లు వేయడంతో భూమి పొరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ ప్రభావం డ్యామ్ లపై పడొచ్చంటున్నారు. ఈ మధ్య కాలంలో ఉస్మాన్ సాగర్ వద్ద పార్కు పేరుతో తవ్వకాలు జరిపారని, వాటి ప్రభావం డ్యామ్ నిర్మాణంపై ఉంటుందంటున్నారు. మురుగునీరు చేరడంతో గేట్లు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. త్వరలో ఎయిర్ పోర్టు మెట్రో లైన్ వేస్తామని అంటున్నారని, ఈ లైన్హిమాయత్ సాగర్ కి అనుకొని వెళ్తుందని, అప్పుడు జరిపే తవ్వకాలు కూడా డ్యామ్ సేఫ్టీపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.
111 జీఓ అమల్లో ఉన్నప్పటికీ..
జంట జలాశయాల ఎగువ ప్రాంతాల్లో 111 జీవో అమల్లో ఉన్నప్పటికీ నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు. అంతేకాకుండా డ్రైనేజీ లైన్లను ఇష్టమొచ్చినట్టుగా వేయడంతో మురుగునీరు జలాశయాల్లోకి వచ్చి చేరుతోంది. ఈ విషయాన్ని అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. రోజురోజుకు మురుగు ప్రవాహం పెరుగుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఈ అంశాలపై దృష్టి పెడితే నిర్మాణాలు చెక్కు చెదరకుండా ఉండే అవకాశం ఉంది.
గేట్లు సరిగా క్లోజ్ కావట్లే
డ్యామ్ సేఫ్టీపై అధికారులు దృష్టి పెట్టాలి. పరిసర ప్రాంతాల్లో బ్లాస్టింగ్స్, బోర్ల తవ్వకాలను అరికట్టాలి. మురుగునీరు రాకుండా చూడాలి. హిమాయత్ సాగర్ గేట్లు పూర్తిగా క్లోజ్ కావడం లేదు. ఎయిర్ పోర్టు మెట్రోపై ముందుగా స్టడీ చేయాలి. వానల టైంలో నీటిని రిలీజ్ చేయడానికి, స్టోర్చేయడానికి ఓ పద్ధతి ఉంటుంది. అధికారులు పాటించడంలేదు.
- దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణవేత్త