నర్సన్నా.. ఉద్యోగాలు ఇప్పించు

నర్సన్నా.. ఉద్యోగాలు ఇప్పించు
మోకాళ్లపై కొండ ఎక్కిన 2008 డీఎస్సీ క్వాలిఫైడ్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట నర్సన్న.. మా ఆవేదన ఆలకించు.. సీఎం కేసీఆర్ మనసు మార్చి మా ఉద్యోగాలు మాకు వచ్చేలా చూడాలంటూ 2008 డీఎస్సీ అభ్యర్థులు వేడుకున్నారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో డీఎస్సీ 2008 బీఈడీ మెరిట్ క్యాండిడేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘నరసింహస్వామికి మొక్కులు.. సీఎం కేసీఆర్ కు వేడుకోలు’ పేరుతో దాదాపు 400 మంది శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. వైకుంఠ ద్వారం రింగు రోడ్డు సర్కిల్ లో మానవహారం నిర్వహించారు. స్వామివారి పాదాలకు ప్రత్యేక పూజలు చేసి మెట్ల మార్గం నుంచి కొండ పైవరకు మోకాళ్లపై నడుచుకుంటూ వెళ్లి స్వామివారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు డీఎస్సీ అభ్యర్థులు మాట్లాడుతూ.. 2008లో అప్పటి ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో క్వాలిఫై అయి మంచి మెరిట్ సాధించినా ఉద్యోగాలు ఇవ్వలేదని గుర్తుచేశారు.

వంద రోజుల క్రితం 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా సీఎం కేసీఆర్ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగాలు ఇస్తామని వరంగల్ లో జరిగిన సభలో సీఎం కేసీఆర్​స్వయంగా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా గత 13 ఏళ్లుగా వేలమంది అభ్యర్థుల జీవితాలు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఏపీ ప్రభుత్వం ఆ ప్రాంతానికి చెందిన 2008 డీఎస్సీ అభ్యర్థులకు మినిమం పే స్కేల్ ఉద్యోగాలు ఇచ్చిందని, రెండేళ్లుగా వారు ఉద్యోగాలు కూడా చేస్తున్నారని గుర్తుచేశారు. కానీ తెలంగాణ ప్రాంతానికి చెందిన తాము మాత్రం ఇంకా నిరుద్యోగులుగానే మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ స్పందించి.. ఉద్యోగాలు ఇచ్చి తమ బతుకుల్లో వెలుగులు నింపాలని విజ్ఞప్తి చేశారు.