హైదరాబాద్, వెలుగు: డీఎస్సీ– 2024లో నియమితులైన టీచర్లకు డీఈవో ఆఫీసుల్లో రిపోర్ట్ చేసిన నాటి నుంచే జీతాలు చెల్లించాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు శనివారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖలో ఉన్న ఖాళీలను భర్తీచేసేందుకు డీఎస్సీ నిర్వహించింది. ఈ నెల 9న డీఎస్సీ– 2024లో రిక్రూట్ అయిన వారికి ఎల్బీస్టేడియం వేదికగా10 వేలకు పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసింది. మరుసటి రోజు అంటే10వ తేదీ నుంచి సంబంధిత జిల్లాల్లో డీఈవోలకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. నియామకపత్రాలు అందుకున్న వారు ఏ రోజు అయితే రిపోర్ట్ చేశారో ఆనాటి నుంచే వారిని ఆన్ డ్యూటీలో ఉన్నట్టుగా పరిగణించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.