జూలై 18 నుంచే డీఎస్సీ పరీక్షలు

  • ఎగ్జామ్ రాయనున్న 2.79 లక్షల మంది
  • 2.79 లక్షల మంది దరఖాస్తు..14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాల ఏర్పాటు  
  • ఇప్పటికి 2.20 లక్షల మంది హాల్ టికెట్ల డౌన్​లోడ్

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో గురువారం నుంచి డీఎస్సీ ఆన్​లైన్​​ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వీటికి సంబంధించిన ఏర్పాట్లను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు పూర్తి చేశారు. ప్రతిరోజు పూటకు 13వేల మందికి పైగా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే హాల్ టికెట్ల డౌన్​లోడ్ ప్రక్రియ మొదలుకాగా, సోమవారం మధ్యాహ్నం వరకు 2.20 లక్షల మంది డౌన్​లోడ్ చేసుకున్నారు. 

ప్రతిరోజూ 26వేల మందికి ఎగ్జామ్

టీచర్ల పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ ఎగ్జామ్స్  జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 2,79,956 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆన్​లైన్ కావడంతో ప్రతిరోజూ ఉదయం.. మధ్యాహ్నం రెండు పూటలా పరీక్షలు పెడుతున్నారు. ఒక్కో షిఫ్ట్​కు 13 వేల చొప్పున.. రోజుకు 26 వేల మందికి పైగా అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. 

ఒక జిల్లా వారికి ఒకే రోజు...

డీఎస్సీ పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంట్లో భాగంగా ఒక జిల్లావారికి ఒకే రోజు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎస్​జీటీలతో పాటు సబ్జెక్టుల వారీగా ఇదే విధానం అమలు చేయనున్నారు. ఒక జిల్లాలో ఎక్కువ మంది అభ్యర్థులుంటే.. పక్క జిల్లాల్లో వారికి సెంటర్లు కేటాయించనున్నారు. తద్వారా నార్మలైజేషన్ చేసే అవకాశం రాకుండా ఉంటుంది. డీఎస్సీ పరీక్షలు ప్రారంభమయ్యే రోజున గురువారం స్కూల్ అసిస్టెంట్ (సోషల్, ఫిజికల్ సైన్స్) తెలుగు మీడియం పోస్టులకు  మార్నింగ్ షిఫ్ట్ లో ఆఫ్టర్ నూన్  షిఫ్ట్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ఎగ్జామ్ జరగనున్నది. చివరి రోజు స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్), లాంగ్వేజీ పండిట్ (హిందీ) పోస్టులకు పరీక్ష ఉంటుంది. 

హాల్ టికెట్లలో తప్పుల సవరణ.. 

డీఎస్సీ హాల్ టికెట్లలోని తప్పులను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సవరిస్తున్నారు. డీఎస్సీ అప్లికేషన్లలో పేరు, డేటాఫ్ బర్త్ తో పాటు మీడియం, జిల్లా, జెండర్, సబ్జెక్టు పేర్లనూ కొందరు అభ్యర్థులు ఆన్​లైన్​లో తప్పుగా ఎంట్రీ చేశారు. వారికి అప్లికేషన్ల ఎడిట్ ఆప్షన్ ఇచ్చినా, దాన్ని మార్చుకోలేదు. దీంతో హాల్ టికెట్లలో అలాగే వచ్చింది. దీంతో కొందరు అభ్యర్థులు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ కు వచ్చి సమస్యను అధికారులకు తెలిపారు. దీంతో వారి హాల్ టికెట్లను అప్​డేట్ చేసి, మంగళవారం సాయంత్ర వరకు సవరించిన కొత్త హాల్ టికెట్లను వెబ్ సైట్​లో పెడ్తామని వారికి సూచించారు.